అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nepal Army | రణరంగంగా మారిన నేపాల్‌లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడంతో పరిస్థితి క్రమంగా మెరుగు పడుతోంది. రెండ్రోజుల పాటు రణరంగం సృష్టించిన యువత ఆర్మీ రాకతో శాంతించింది.
నిరసనకారులు వెంటనే ఆందోళనలు విరమించాలని సైన్యం(Nepal Army) పిలుపునిచ్చింది. తక్షణమే ఆయుధాలు, పేలుడు పదార్థాలను అప్పగించాలని కోరింది. సాయుధ బలగాలు నేపాల్ రాజధాని ఖాట్మాండ్(Kathmandu) సహా వివిధ పట్టణాల్లో గస్తీ కాస్తున్నాయి.
Nepal Army | నిరసనలు ఆపాలి..
ఆందోళనకారులు తక్షణమే నిరసనలను విరమించాలని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్ కోరారు. ఆందోళనలు పకకన పెట్టి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. “నిరసన కార్యక్రమాలను నిలిపివేసి, దేశం కోసం శాంతియుతంగా బయటపడటానికి సంభాషణ కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిని సాధారణ స్తితికి తీసుకురావాలి. మన చారిత్రక మరియు జాతీయ వారసత్వాన్ని, ప్రజా, ప్రైవేట్ ఆస్తులను రక్షించాలి. సాధారణ ప్రజలకు, దౌత్య కార్యకలాపాలకు భద్రతను నిర్ధారించాలని” పిలుపునిచ్చారు.
Nepal Army | భగ్గుమన్న యువత
రెండ్రోజులుగా నేపాల్(Nepal) భగ్గుమన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాపై విధించిన నిషేధంతో మొదలైన నిరసనల వెల్లువ అవినీతి, బంధుప్రీతి వ్యతిరేక ఉద్యమంగా మారింది. వేలాది మంది విద్యార్థులు, యువకులు రోడ్లెక్కి విధ్వంసం సృష్టించారు. దీంతో ప్రధాని శర్మ ఓలి(PM Sharma Oli) సహా మంత్రులు రాజీనామా చేయడంతో ప్రభుత్వం కూలిపోయింది. అయినప్పటికీ శాంతించని విద్యార్థులు పార్లమెంట్, సుప్రీంకోర్టుతో పాటు అధ్యక్షుడు, ప్రధాని, మంత్రుల ఇళ్లకు నిప్పుపెట్టారు. వీధుల్లో వీరంగం వేస్తూ మంత్రులు, మాజీ మంత్రులపై దాడులకు పాల్పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడి లూటీ చేశారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రశాంతతను కాపాడుకునే బాధ్యతను సైన్యం తీసుకుంది. ఈ నేపథ్యంలో నిరసనకారులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. నిరసనల పేరిట కొంత మంది రెచ్చిపోతున్నారని, ప్రజా ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని తెలిపింది. ఇది దేశానికి మంచిది కాదని పేర్కొంది. “కొన్ని గ్రూపులు క్లిష్ట పరిస్థితిని అనవసరంగా ఉపయోగించుకుంటున్నాయి. సాధారణ పౌరులకు మరియు ప్రజా ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. “నేపాల్ చరిత్ర ప్రారంభం నుంచి నేపాల్ సైన్యం ఎల్లప్పుడూ – క్లిష్ట పరిస్థితులలో కూడా దేశ స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వేచ్ఛ, జాతీయ ఐక్యత. నేపాలీ ప్రజల భద్రతను కాపాడటానికి కట్టుబడి ఉంది” అని పేర్కొంది.
Nepal Army | సైన్యం ఎంట్రీతో సద్దుమణిగిన నిరసనలు
నేపాల్‌లోని పరిస్థితులు ఇప్పడిప్పుడే సర్దుకుంటున్నాయి. ఆర్మీ రంగంలోకి దిగడంతో నిరసనకారులు శాంతించారు. నేపాల్‌తో పాటు నేపాల్ ప్రజల సంరక్షణ కోసం ఆందోళనలు విరమించాలన్న సైన్యం విజ్ఞప్తితో నిరసనలు నిలిపి వేశారు. అయితే, దేశంలో వీలైనంత త్వరగా కొత్త ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఎక్కడ చూసినా శిథిలాలుగా మారిన భవనాలు, కాలిపోయిన వాహనాలే కనిపిస్తున్నాయి. పార్లమెంట్, సుప్రీంకోర్టు భవనాలు(Supreme Court Buildings) మంటల్లో కాలిబూడిదయ్యాయి. రోడ్లపై కాలిపోయిన వేలాది వాహనాలు కనిపిస్తున్నాయి.