అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కామారెడ్డి కలెక్టర్ (Kamareddy Collector) కొరడా ఝులిపించారు. ఏకంగా 125 మంది పంచాయతీ కార్యదర్శులకు (panchayat secretaries) షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Indiramma Housing Scheme | ఆది నుంచి ఇళ్ల నిర్మాణాలపై నిర్లక్ష్యం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఎప్పటికప్పుడు అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు అదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా అనుకున్న స్థాయిలో పనుల్లో పురోగతి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్ చర్యలకు పూనుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కనీస మార్కింగ్ చేయడంలో విఫలమైన 125 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Indiramma Housing Scheme | ఆలస్యంగా వెలుగులోకి..
జిల్లాలోని 125 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ప్రతి మండలంలో ఇందిరమ్మ నిర్మాణాలు మార్కింగ్ చేయకుండా ఐదుగురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ జారీ చేశారు. ఈనెల 15న షోకాజ్ నోటీసులు జారీ చేసినా ఎక్కడ కూడా ఈ విషయం బయటకు పొక్కలేదు. ఈ విషయమై పలువురు పంచాయతీ కార్యదర్శులకు ఫోన్‌చేసి వివరణ కోరగా షోకాజ్ నోటీసులు వచ్చిన విషయం నిజమేనన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో (Indiramma house constructions) బాటమ్‌లో ఉన్న మండలాలకు చెందిన కార్యదర్శులందరికీ నోటీసులు వచ్చాయన్నారు.
లబ్ధిదారులు ముందుకు రావడం లేదు : మహేష్, పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడు
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సమయంలో ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో మంజూరైన లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటామన్నారని పంచాయతీ కార్యదర్శుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహేష్ తెలిపారు.
తీరా ఇప్పుడు పెట్టుబడి మొదట పెట్టి ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. తమకు ఇల్లు అవసరం లేదని రాసిస్తామంటున్నారని తెలిపారు.
గ్రామస్థులేమో కట్టుకుంటామని ముందుకొచ్చిన వారికి మంజూరు ఇవ్వాలని చెబుతున్నారన్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు చెబితే.. ముందు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారని వాపోయారు. లబ్ధిదారులకు ఎంత చెప్పినా వినడం లేదని, వాళ్ళు ఇల్లు కట్టుకోకపోతే తామేమి చేస్తామని మహేష్ వాపోయారు.

