అక్షరటుడే, వెబ్‌డెస్క్: Peter Navarro | భారత్ రష్యా సంబంధాలపై తరచూ నోరు పారేసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Trump) సీనియర్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు.
అయితే, ఆయన చేసిన ఆరోపణలను సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్ Xలో ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పి కొట్టింది. ఇండియా తన స్వప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని పెంచి పోషిస్తోందని నవారో ఆరోపించారు. ఈ ఆరోపణలను X కమ్యూనిటీ నోట్ ద్వారా తోసిపుచ్చింది.
Peter Navarro | నవారో తప్పుడు కూతలు..
రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని (Russia-ukrain War) ప్రారంభించక ముందు ఇండియా మాస్కో నుంచి చమురును కొనుగోలు చేయలేదని నవారో తెలిపారు. యుద్ధం తర్వాతే తక్కువ ధరకు చమురు కొంటూ భారీగా లబ్ధి పొందుతోందని నవారో పోస్ట్ చేశారు. ఇండియా చమురు కొంటూ రష్యన్ యుద్ధ ప్రయత్నాలకు ఆర్థికంగా మద్దతు ఇస్తుందని ఆరోపించారు. అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోవడానికి భారతదేశం సుంకాలే కారణమని నిందించారు. అయితే, వివిధ విశ్వసనీయ వర్గాల సమాచారంతో X ఆయన ఆరోపణలను తిప్పికొట్టింది. భారతదేశం రష్యన్ చమురును (Russia Oil) కొనుగోలు చేయడం ప్రధానంగా ఇంధన భద్రత కోసమేనని కమ్యూనిటీ నోట్‌లో పేర్కొంది.
భారత్ స్వతహాగా వ్యవహరించడం అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేస్తుంది. పాశ్చాత్య ఆంక్షల తర్వాత తగ్గింపు ధరల కారణంగా రష్యా నుంచి ఇండియా (India) చమురు దిగుమతులు పెరిగాయని గుర్తు చేసింది. నవారో ఆరోపణలు కపటత్వనికి నిదర్శనమని.. అమెరికా ఇప్పటికీ రష్యా నుంచి గణనీయమైన వస్తువులను దిగుమతి చేసుకుంటూనే ఉందని కూడా ఎత్తిచూపింది.
Peter Navarro | మస్క్‌పై నవారో ఆగ్రహం
ఫ్యాక్ట్ చెక్ చేసిన X వాస్తవాలు వెల్లడించడంతో నవారో ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో ఆయన X అధినేత ఎలాన్ మస్క్‌పై విరుచుకుపడ్డారు. కమ్యూనిటీ నోట్‌ను “చెత్త” అని అభివర్ణించారు. ఎలోన్ మస్క్ (Elon Musk) తప్పుడు ప్రచారాన్ని అనుమతించారని ఆరోపించారు. అతను తన వాదనలను రెట్టింపు చేస్తూ, ఇండియా లాభదాయకం కోసం మాత్రమే రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్నారు. “ఉక్రేనియన్లను చంపడం ఆపండి. అమెరికన్ ఉద్యోగాలను తీసుకోవడం ఆపండి” అని నవారో విమర్శలను మరింత తీవ్రతరం చేశారు.
నవారో, మస్క్ మధ్య నెలకొన్న విభేదాలను తాజా ఎపిసోడ్ మరోసారి ఎత్తిచూపుతోంది. గతంలో మస్క్ టెస్లా కంపెనీని (Tesla Company) నవారో విమర్శించడం, ఆయనపై పదునైన వ్యక్తిగత విమర్శలతో మస్క్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే.