అక్షరటుడే, వెబ్‌డెస్క్: Wi-Fi Calling | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) తన వినియోగదారుల కోసం సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉచిత వాయిస్ ఓవర్ వైఫై (Voice over Wi-Fi services) సేవలను ప్రారంభించింది. మొబైల్ సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా వైఫై సాయంతో స్పష్టమైన కాల్స్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
అలాగే ఎస్ఎంఎస్లు (Bharat Sanchar Nigam Limited) కూడా పొందవచ్చు. దీని ద్వారా వినియోగదారులకు మొబైల్ సిగ్నల్ సమస్య నుంచి విముక్తి లభించనుంది. మారుమూల ప్రాంతాల్లో ఉండే బీఎస్ఎన్ఎల్ వియోగదారులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. బీఎన్ఎన్ఎల్ ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఈ సేవలను అందుబాటులోకి తేవడం గమనార్హం. ఈ కొత్త సేవతో బీఎస్ఎన్ఎల్.. జియో(Jio), ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెల్కోల సరసన చేరినట్లయింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఇది బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఆధునికీకరణలో కీలకమైన ఘట్టమని పేర్కొంది.
Wi-Fi Calling | వాయిస్ ఓవర్ వైఫై అంటే…
వాయిస్ ఓవర్ వైఫై(VoWiFi) అనేది అధునాతన ఐఎంఎస్ ఆధారిత సాంకేతికత. సాధారణంగా కాల్స్ మాట్లాడాలంటే మొబైల్ టవర్ల నుంచి సిగ్నల్ ఉండాలి. కానీ చాలా ప్రాంతాల్లో ఇళ్ల లోపల, బేస్మెంట్లు, ఎత్తైన భవనాలు, ఎత్తైన ప్రదేశాలలో మొబైల్ సిగ్నల్ సరిగ్గా అందదు. ఇలాంటి సమయంలో మొబైల్ సిగ్నల్‌తో సంబంధం లేకుండా మీ వద్ద ఉన్న వైఫై కనెక్షన్ సాయంతో స్పష్టమైన కాల్స్ మాట్లాడుకోవడానికి వాయిస్ ఓవర్ వైఫై ఉపయోగపడుతుంది. ఈ సేవను సాధారణంగా వైఫై కాలింగ్ అని పిలుస్తారు.
Wi-Fi Calling | ప్రయోజనాలు..
వైఫై కాలింగ్ ద్వారా వాయిస్ కాల్స్ అత్యంత స్పష్టంగా ఉంటాయి. కాల్ డ్రాప్(Call drop) సమస్య ఉండదు.
ప్రత్యేక యాప్ అవసరం లేకుండానే నేరుగా ఫోన్ డయలర్ నుంచి కాల్స్ చేసుకోవచ్చు.
బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.
వినియోగదారులు తమకు అందుబాటులో ఉన్న బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ లేదా ఇతర ఏదైనా వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించి వైఫై సేవలు పొందవచ్చు. ఒకవేళ మీరు కాల్ మాట్లాడుతుండగా వైఫై పరిధి నుంచి బయటకు వెళ్తే, ఆ కాల్ కట్ అవ్వకుండా ఆటోమేటిక్‌గా మొబైల్ నెట్‌వర్క్‌కు చేంజ్ అవుతుంది.
Wi-Fi Calling | గ్రామీణ ప్రాంతాలకు వరం…
మారుమూల గ్రామాలు, సరిహద్దు ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య వేధిస్తుంది. ఆయా ప్రాంతాల్లో మొబైల్ టవర్ల ఏర్పాటు సైతం కష్టతరమైనది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్(Rural areas)లో డిజిటల్ కనెక్టివిటీని పెంచడానికి, నెట్వర్క్ రద్దీని తగ్గించడానికి వైఫై కాలింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే లక్షకుపైగా మేడ్ ఇన్ ఇండియా 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. త్వరలో దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.
ఈ సేవలను పొందడానికి వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్(Settings)లోకి వెళ్లి వైఫై కాలింగ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇతర వివరాలకు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ సెంటర్‌ను గాని, 1800 1503 హెల్ప్‌లైన్ నంబర్‌ను గాని సంప్రదించండి.