అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kargil War | పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికులను యావత్ భారతావతి శనివారం స్మరించుకుంది. 1999లో పాక్‌తో (Pakistan) కార్గిల్ వివాదంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి, ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు నివాళులర్పించింది.
కార్గిల్ విజయ్ దివస్ 26వ వార్షికోత్సవం సందర్భంగా భారత సైనికుల (Indian soldiers) త్యాగాలను దేశం గుర్తు చేసుకుంది. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu), ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఘనంగా నివాళులు అర్పించారు. 1999లో పాకిస్తాన్ దళాలు కార్గిల్ పర్వత ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించడంతో వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ను (Operation Vijay) చేపట్టింది. దాదాపు మూడు నెలల భీకర యుద్ధం తర్వాత భారత సైన్యం విజయవంతంగా తిరిగి వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలను అర్పించారు.
Kargil War | వారి త్యాగాలు స్ఫూర్తిదాయకం
దేశ జవాన్ల అసాధారణ శౌర్యం, దృఢ సంకల్పాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. “మాతృభూమి కోసం ప్రాణాలను త్యాగం చేసిన ధైర్య సైనికులకు నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఈ రోజు మన జవాన్ల అసాధారణ శౌర్యం, ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతీక. దేశం కోసం వారి అంకితభావం, అత్యున్నత త్యాగం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందని” ఆమె X (గతంలో ట్విట్టర్)లో పేర్కొన్నారు. సైనికుల త్యాగం భారత ప్రజలకు అన్ని రంగాలలో స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుందని రాష్ట్రపతి తెలిపారు.
Kargil War | ప్రధాని మోదీ నివాళి
భారత సాయుధ దళాల (Indian Armed Forces) అసమాన ధైర్యాన్ని అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. “దేశ గౌరవాన్ని కాపాడుకోవడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన మన సైనికుల అసమాన ధైర్యాన్ని, పరాక్రమాన్ని గుర్తు చేస్తుంది. మాతృభూమి కోసం తమను తాము త్యాగం చేసుకునే వారి స్ఫూర్తి ప్రతి తరానికి స్ఫూర్తినిస్తుంది” అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) కూడా అమరవీరులకు నివాళి అర్పించారు. “అత్యంత కఠినమైన భూభాగాల్లో మన దేశ గౌరవాన్ని కాపాడుకోవడంలో అసాధారణ ధైర్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిన మన ధైర్యవంతులకు నేను హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. కార్గిల్ యుద్ధంలో వారి అత్యున్నత త్యాగం మన సాయుధ దళాల అచంచల సంకల్పానికి చిరస్మరణీయ జ్ఞాపకం. భారతదేశం వారి సేవకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది” అని X లో పోస్టు చేశారు.