అక్షరటుడే, కామారెడ్డి: National Lok Adalat | పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం శనివారం జిల్లాలోని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ (National Lok Adalat) నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ (Telangana Legal Services Authority) హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 8 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఎల్లారెడ్డి, బాన్సువాడ బిచ్కుంద కోర్టుల్లోనూ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలకు సమయానుకూలంగా, తక్కువ ఖర్చుతో, సఖ్యతతో న్యాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కోర్టులలో కేసులు చాలాకాలం కొనసాగుతుంటాయని, దీని వల్ల సమయం, డబ్బు, శ్రమను కోల్పోతామని, లోక్ అదాలత్లో (Lok Adalat) వివాదాలు పరిష్కరించబడతాయన్నారు. దీని వల్ల రెండు పక్షాలకూ న్యాయం జరుగుతుందన్నారు.
సివిల్ కేసులు (Civil cases), భూవివాదాలు, ఒప్పందాలు, సొసైటీ వివాదాలు, ఫ్యామిలీ/మ్యారేజ్ సంబంధిత వివాదాలు, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు (finance institutions) సంబంధించిన రుణాల కేసులు పరిష్కరించబడతాయన్నారు.
రికవరీ కేసులు, వాహన ప్రమాద పరిహార కేసులు, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, విద్యుత్ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, ఇతర పబ్లిక్ యుటిలిటీ సర్వీసుల వివాదాలు, సత్వరం పరిష్కరించగలిగే ఇతర కేసులు, కోర్టులలో సంవత్సరాల తరబడి కొనసాగే కేసులు లోక్ అదాలత్లో ఒక రోజుల్లోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
లోక్ అదాలత్లో కేసు పరిష్కారమైతే, చెల్లించిన కోర్టు ఫీజు పూర్తిగా తిరిగి చెల్లించబడుతుందని తెలిపారు. లోక్ అదాలత్లో తీసుకున్న తీర్పు తుదితీర్పుగా పరిగణించబడుతుందన్నారు. దానిపై అప్పీల్ ఉండదని పేర్కొన్నారు. జిల్లాలోని కక్షిదారులు ఈ లోక్ అదాలత్లో పాల్గొని పెండింగ్ కేసులు, వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు.