అక్షరటుడే, వెబ్‌డెస్క్: Junk Food Day | ఆరోగ్యాన్ని దెబ్బతీసే జంక్ ఫుడ్ కోసం ప్రత్యేకంగా జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం ఎందుకు పెట్టారనే అనుమానం మన అందరికీ వస్తుంది. అయితే ఈ రోజు రావడం వెనక పలు కారణాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ గురించి తెలుసుకున్న చాలా మంది ఆ ఫుడ్ జోలికే వెళ్లరు. అయితే ఈ రోజు మాత్రం అలాంటి వారు రకరకాల జంక్ ఫుడ్‌ను (Junk Food) టేస్ట్ చూడాలి, కంట్రోల్ లేకుండా తినాలి, రుచికరమైన చీజ్ కావాల్సినంత వేసుకొని ఫుల్‌గా తినేయాలని అనుకుంటారు. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్(Breakfast), లంచ్(Lunch), డిన్నర్(Dinner) అన్నింట్లోనూ జంక్ ఫుడ్ ఉండేలా కొందరు ప్లాన్ చేసుకుంటారు. అలా ఒక్క రోజు తింటే ఎలాంటి సమస్య లేదు, అదీ కాక జంక్ ఫుడ్ తయారీకి అవసరమైన పంటల్ని పండిస్తున్న రైతులకు పరోక్షంగా మేలు చేసినట్లు అవుతుందని కొందరు చెప్పుకొస్తున్నారు.
Junk Food Day | జంక్ ఫుడ్ చరిత్ర..
అయితే జంక్ ఫుడ్ అనగానే మనకు వెంటనే నెగెటివ్ ఆలోచనలే వస్తాయి. లావు అవుతామేమో, బీపీ, షుగర్ వచ్చే ప్రమాదం ఉందేమో అనిపిస్తుంది. ఇందులో నిజం ఉంది కానీ.. ఒక హద్దు దాటి తింటేనే సమస్య. మితంగా తీసుకుంటే.. జంక్ ఫుడ్ వలన ఎలాంటి సమస్య ఉండదు. జంక్ ఫుడ్‌లో ఎక్కువగా ట్రాన్స్‌ఫాట్స్ (Transfats), హై షుగర్ (High Sugar), సాల్ట్ మరియు కేలరీలు ఉంటాయి. ఇవి శరీరానికి అంతగా ఉపయోగకరమైనవి కావు కానీ.. గుండె, బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ట్రాన్స్‌ఫాట్స్ శరీరంలో కరగదు, దాని వలన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక ఉప్పు బీపీ సమస్యలకు దారితీస్తుంది. షుగర్, కేలరీలు వలన డయాబెటిస్, అధిక బరువు సమస్యలు వస్తాయి.
కాబట్టి ఇవన్నీ తక్కువ పరిమాణంలో తీసుకోవడమే మంచిది. బజార్లలో లభించే సమోసా, మిర్చీ బజ్జీ, పకోడి, పుణుగులు, బోండాలు వంటివి మన దేశీయ జంక్ ఫుడ్స్. ఇవి ఆయిల్ ఎక్కువగా వాడే పదార్థాలు. అయినా వీటిని మితంగా తీసుకుంటే విదేశీ జంక్ ఫుడ్ కంటే తక్కువ హానికరం. విదేశీ జంక్ ఫుడ్ (Foreign junk food) అయిన పిజ్జా, బర్గర్, కుకీలు, చిప్స్, శాండ్‌విచ్‌లు, కప్ కేకులు, మైదా ఫుడ్ వంటి వాటిని బాగా ప్రాసెస్ చేస్తారు. వీటిలో ఫైబర్ తక్కువ, కార్బ్స్ ఎక్కువ. మన దేశంలోని జంక్ ఫుడ్ అలవాటు కూడా వీటివల్లే ఎక్కువైంది. జంక్ ఫుడ్ డే చరిత్ర ఏమిటి అనేది చూస్తే.. ఈ రోజును ప్రారంభించినది ఎవరో ఖచ్చితంగా తెలియదు కానీ 1970లలో మైక్రోబయాలజిస్ట్ మైకెల్ జాకోబ్సన్ “Junk Food” అనే పదాన్ని ప్రచారంలోకి తెచ్చారు.
జంక్ అంటే “చెత్త” అన్న అర్థం. అందువల్ల జంక్ ఫుడ్ అంటే శరీరానికి ఉపయోగం లేని, రుచి కలిగిన ఆహారం అన్నమాట. మొదటగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నిల్వ ఉండే ఫుడ్‌ల వాడకంతో జంక్ ఫుడ్ ప్రారంభమైంది. తరువాత కాలంలో ప్యాకేజ్డ్, ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది ఇంట్లో వండుకోవడం తగ్గించారు. రెడీ టు ఈట్ ప్యాకెట్ ఫుడ్‌పై ఆధారపడుతున్నారు. ఫుడ్ డెలివరీ యాప్స్ (Food Delivery Apps) ద్వారా ఎక్కువగా తినడం జరుగుతోంది. ఈ తరహా అలవాట్ల వల్లనే గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి జంక్ ఫుడ్‌ను తినవద్దని.. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు.