అక్షరటుడే, నిజాంసాగర్ : NH765D | జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్ – బోధన్(hyderabad – bodhan) మార్గాన్ని జాతీయ రహదారి 765డిగా విస్తరిస్తున్నారు. పనులు నెమ్మదిగా కొనసాగుతుండడంతో వాహనదారులకు అవస్థలు తప్పడంలేదు. ఇప్పటికే మెదక్ వరకు విస్తరణ పనులు పూర్తయ్యాయి. మెదక్ నుంచి బోధన్ (medak – bodhan) వరకు పనులు చేపడుతున్నారు. ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు 51.66 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ కోసం రూ.313 కోట్లు మంజూరయ్యాయి. ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్ మండల కేంద్రాల మీదుగా రోడ్డు పనులు చేపడుతున్నారు.
NH765D | నెలల తరబడిగా..
రోడ్డు విస్తరణ కోసం ఇప్పటికే భూ సేకరణ చేశారు. అయితే అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్ (contractor) నత్తనడకన పనులు చేపడుతున్నాడు. జాతీయ రహదారి (national highway) కోసం రోడ్డు పంట పొలాలు తవ్వి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మండల కేంద్రాలు, గ్రామాల్లో పనులు పూర్తి చేయలేదు. పలు చోట్ల రోడ్డు తవ్వి కంకర పోసి వదలిలేశారు. దీంతో దుమ్ము దూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
NH765D | నాసిరకంగా పనులు
జాతీయ రహదారి(national highway) నిర్మాణంలో భాగంగా గ్రామాలు, మండల కేంద్రాల్లో సర్వీస్ రోడ్లు వేస్తున్నారు. ఇరువైపులా డ్రెయినేజీ నిర్మించి సర్వీస్ రోడ్డు(service road) వేస్తున్నారు. అయితే డ్రెయినేజీ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. డ్రెయినేజీలు (drainage), దాని మీద పైకప్పు పనులకు వాటర్ క్యూరింగ్ సరిగ్గా చేయడం లేదు. అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారు. ఇళ్ల ముందు రోడ్డు తవ్వి పనులు చేపడుతున్నారు. అయితే పనులు నెలల తరబడి సాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
NH765D | వాటర్ క్యూరింగ్ చేస్తున్నాం
– శ్రీధర్ కుమార్, ఎన్హెచ్ఏఐ ఏఈఈ
జాతీయ రహదారి పనులు నాణ్యత మేరకు చేపడుతున్నాం. రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన డ్రెయినేజీలకు అవసరం మేరకు వాటర్ క్యూరింగ్ చేపడుతున్నాం. గ్రామాలు, పట్టణాల్లో రోడ్డు పనులతో దుమ్ము లేవకుండా నిత్యం ట్యాంకర్‌తో నీరు పడుతున్నాం. పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటాం.