అక్షరటుడే, వెబ్డెస్క్ : Nara Rohit | టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, నటి శిరీష లేళ్ల వివాహం గురువారం రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో అగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu), ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నారా కుటుంబానికి చెందిన పలువురు బంధువులు, సినీ ప్రముఖులు కూడా వేడుకలో పాల్గొన్నారు.
Nara Rohit | ప్రేమకథ నుండి పెళ్లి బంధం వరకు..
‘ప్రతినిధి 2’ చిత్రంలో హీరోగా రోహిత్ (Nara Rohit), హీరోయిన్‌గా శిరీష కలిసి నటించారు. అదే సమయంలో వీరి పరిచయం ఏర్పడి, క్రమంగా ప్రేమగా మారింది. ఇరువురి కుటుంబాల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్ 13న నిశ్చితార్థం జరిగింది. అయితే రోహిత్ తండ్రి మరణం కారణంగా పెళ్లి వాయిదా పడింది. కాగా.. గురువారం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహానికి ముందు నాలుగు రోజుల పాటు హల్దీ, మెహందీ, సంగీత్ తదితర కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో నారా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.
39 ఏళ్ల రోహిత్ 2009లో విడుదలైన ‘బాణం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అనంతరం సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర, జ్యో అచ్యుతానంద వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘సుందరకాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శిరీష లేళ్ల స్వస్థలం పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం. ఆమె ఏపీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. అక్కడ కొంతకాలం ఉద్యోగం చేసిన ఆమెకు సినిమాపై ఉన్న మక్కువతో తిరిగి ఇండియాకు వచ్చి, హైదరాబాద్‌లో తన అక్క వద్ద ఉండి ఆడిషన్లలో పాల్గొన్నారు. ఆ క్రమంలోనే ఆమె ‘ప్రతినిధి 2’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అదే సినిమా ఆమె జీవితాన్ని మార్చింది.

