అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nara Bhuvaneshwari | స్వాతంత్య్రం (Independence) వచ్చిన నాటి నుంచి అంటే దాదాపు 75 ఏళ్లుగా ఒకే సమస్యతో అల్లాడుతున్న గ్రామస్తులకు, ఇప్పుడు తీరని ఆశ అనుకోకుండా నెరవేరింది. ఆ సమస్యను పరిష్కరించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) కాదు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి.
కేవలం ఆరు నెలల వ్యవధిలోనే, గ్రామస్తులు వందల సంఖ్యలో కోరిన సమస్యను పరిష్కరించి అందరి మన్ననలు పొందారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని ఎస్. గొల్లపల్లి గ్రామంలో సుమారు 500 మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే, ఈ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకుండా ఉండటం వల్ల ప్రజలు రోజూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Nara Bhuvaneshwari | ప్రశంసల వర్షం..
విద్యార్థులకు పాఠశాలకు వెళ్లడం కష్టమయితే, అనారోగ్యపడ్డవారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం మరింత కష్టంగా మారింది.అనేక ప్రభుత్వాలు మారినా, ప్రజా ప్రతినిధులు విన్నట్టు చెవులు పెట్టినా, సమస్యకు పరిష్కారం దొరకలేదు. రోడ్డు అడుగుతున్న గ్రామస్తులకు సమాధానం లేదు. పరిస్థితి మారక మళ్లీ అదే కష్టాలు ఉత్పన్నమయ్యేవి.
అయితే కొన్ని నెలల క్రితం, నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) తన ప్రజా పర్యటనలలో భాగంగా రామకుప్పం మండలంలోని పల్లికుప్పం, కావలిమడుగు, ఎస్. గొల్లపల్లి, గడ్డూరు, పంద్యాలమండుగు గ్రామాలను సందర్శించారు. గొల్లపల్లి గ్రామానికి చేరుకున్న భువనేశ్వరి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యను స్వయంగా గమనించారు. గ్రామంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె శ్రద్ధగా విన్నారు.
ఆ వెంటనే, ఆమె సమస్యను రాష్ట్ర ప్రభుత్వానికి వేగంగా అందించారు. అధికారులతో మాట్లాడి, గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. నారా భువనేశ్వరి పర్యటనకు ఆరు నెలలకే, ఎస్. గొల్లపల్లి గ్రామానికి (Gollapalli Village) రహదారి నిర్మాణం పూర్తయింది. నూతన రహదారిని చూడగానే గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకపోయాయి.తాము 75 ఏళ్లుగా ఎదురుచూసిన రోడ్డు కల నిజమవడంతో, వారు నారా భువనేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు.
కానీ భువనేశ్వరి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు” అంటూ గ్రామస్థులు భావోద్వేగంతో తెలిపారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు నారా భువనేశ్వరిని ప్రశంసిస్తూ మాట్లాడుతూ, మా గ్రామానికి నూతన యుగం వచ్చినట్లుంది. ఇప్పుడైనా మా పిల్లలు భద్రంగా స్కూల్‌కి వెళ్లగలుగుతారు. అస్సలు ఏ ప్రభుత్వానికి మేం కనబడలేదేమో అనిపించింది. కానీ భువనేశ్వరి గారు వచ్చారు. మమ్మల్ని చూసారు. మాట ఇచ్చారు. పనిని పూర్తి చేశారు అని చెప్పుకొచ్చారు.