HomeUncategorizedIsrael Cabinet | గాజా స్వాధీనానికి ఇజ్రాయిల్ కేబినెట్ ఆమోదం

Israel Cabinet | గాజా స్వాధీనానికి ఇజ్రాయిల్ కేబినెట్ ఆమోదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Israel Cabinet | హ‌మాస్‌(Hamas)ను అంత‌మొందించ‌డ‌మే ల‌క్ష్యంగా పోరాడుతున్న ఇజ్రాయిల్ కీలక నిర్ణ‌యం తీసుకుంది. గాజాను స్వాధీనం చేసుకోవ‌డం ద్వారా సుదీర్ఘ స‌మ‌రానికి తెర దించాల‌ని భావిస్తోంది. ఈ మేర‌కు ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహు(PM Benjamin Netanyahu) నేతృత్వంలో స‌మావేశ‌మైన కేబినెట్ గాజా స్వాధీనానికి నిర్ణ‌యించింది. గాజా నగరాన్ని ఆధీనంలోకి తీసుకునే సైనిక ప్రణాళికను ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదించింది. గాజా స్వాధీనం చేసుకుంటామ‌ని కొన్నాళ్ల‌గా బెంజ‌మిన్ చెబుతున్నారు. దీనిపై తీవ్ర విమ‌ర్శలు వెల్లువెత్తుతున్న‌ప్ప‌టికీ, ఆయ‌న వెన‌క్కు త‌గ్గ‌లేదు. తాజాగా మంత్రివ‌ర్గం(Cabinet)లో గ్రీన్‌సిగ్న‌ల్ పొంద‌డం ద్వారా త‌న పంథాన్ని నెగ్గించుకున్నారు. అయితే, గాజాను స్వాధీనం చేసుకోవాల‌న్న నిర్ణ‌యం యుద్ధాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేస్తుంద‌న్న ఆందోళ‌న‌లు నెలకొన్నాయి.

Israel Cabinet | స్వీయ భ‌ద్ర‌త కోసం..

హమాస్‌ను ఓడించడానికి గాజా స్ట్రిప్‌ను పూర్తిగా సైనిక నియంత్రణలోకి తీసుకోవాలని నిర్ణ‌యించిన‌ట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. గాజా పరిపాలనను అరబ్ అధికారులకు అప్పగించాలని యోచిస్తోందని ప్రకటించారు. “మా భద్రతను నిర్ధారించడానికి, అక్కడి హమాస్‌ను తొలగించడానికి, గాజాను స్వాధీనం(Gaza Occupation) చేసుకోవాల‌ని కేబినెట్‌లో నిర్ణ‌యించామ‌ని” అని చెప్పారు. అయితే, గాజాపై శాశ్వత నియంత్రణను కొనసాగించే ఉద్దేశ్యం లేదని నెతన్యాహు స్ప‌ష్టం చేశారు. ఆ భూభాగం పాలనను చివరికి అరబ్ దేశాలకు బదిలీ చేయవచ్చని సూచించారు.

Israel Cabinet | సుదీర్ఘ పోరాటం..

ఇజ్రాయిల్ త‌న ర‌క్ష‌ణ కోసం తీవ్ర పోరాటం చేస్తోంది. హ‌మాస్‌, హెజ్బోల్లా వంటి సంస్థ‌ల నుంచి ముప్పును ఎదుర్కొంటూ వ‌స్తున్న‌ది. అయితే, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై జరిగిన ఆక‌స్మిక దాడిలో 1200 మందికి పైగా మృతి చెందారు. అలాగే కొంత మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఆ సంస్థ‌ల‌ను తుద‌ముట్టించేందుకు యుద్ధం ప్రారంభించింది. గాజాపై భారీ దండయాత్ర చేప‌ట్ట‌డంతో 61,000 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెంద‌గా, ల‌క్ష‌లాది మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ గాజాకు అన్ని సహాయాలను నిలిపివేసింది, ఇది అక్కడ మానవతా సంక్షోభానికి కూడా దారితీసింది. ఇప్పటికే గాజాలో 75 శాతం భూభాగాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది.