అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nandyal district road accident | ఆంధ్రప్రదేశ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. నంద్యాల Nandyal జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, అన్నమయ్య జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని నల్లగట్ల–బత్తలూరు మధ్య నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న క్వాలిస్ కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Nandyal district road accident | ఒకే కుటుంబం..
తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు హైదరాబాద్‌కు Hyderabad చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో క్వాలిస్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు వాహనంలో ఇరుక్కుపోవడంతో క్రేన్ సహాయంతో బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని ప్రాథమిక సమాచారం అందిందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా, అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో మరో రోడ్డు ప్రమాదం Road Accident జరిగింది. శబరిమలై నుంచి శంషాబాద్‌కు తిరుగు ప్రయాణంలో ఉన్న మినీ బస్సు సంబేపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ బస్సులో రంగారెడ్డి జిల్లాకు చెందిన 16 మంది అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ రాజు, మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.