అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nampally fire accident | నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణం గోదాంలో శనివారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో సహాయక బృందాలు ఐదుగురి మృతదేహాలను వెలికి తీశాయి.
ఫర్నీచర్ దుకాణం (furniture store) గోదాంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ ఎక్కువగా ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో అగ్ని మాపక సిబ్బంది, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఇతర శాఖల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఐదుగురు సెల్లార్లో చిక్కుకుపోయారు. ఆదివారం ఉదయం వరకు కూడా సహాయక బృందాలు సెల్లార్లోకి వెళ్లలేకపోయాయి. దీంతో జేసీబీ సాయంతో సెల్లార్‌కు రంధ్రం చేసి సిబ్బంది లోనికి వెళ్లారు. ఈ క్రమంలో ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు ప్రణీత్, అఖిల్, బేబీ, ఇంతియాజ్, హబీబ్‌గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి (Osmania Hospital) తరలించారు.
Nampally fire accident | అనుమతులు తీసుకోలేదు
నాంపల్లి అగ్ని ప్రమాద (Nampally fire accident) ఘటనపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఫర్నిచర్ పెట్టడం ప్రమాద తీవ్రతను పెంచిందన్నారు. ఫర్నిచర్‌తో పాటు కెమికల్స్‌ను సెల్లార్లో పెట్టారని చెప్పారు. అగ్ని మాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. షాపు యజమాని సతీశ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Nampally fire accident | బాధితులను ఆదుకుంటాం
నాంపల్లి అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఘటనను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నిబంధనలు పాటించకుండా ఘటనకు కారణమైన షాపు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, హైడ్రా అధికారులు సమన్వయం చేసుకొని చర్యలు చేపట్టాలన్నారు.