అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nampally Exhibition | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గురువారం నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన దృష్ట్యా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రతి ఏటా నుమాయిష్ ఘనంగా నిర్వహిస్తారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ కొనసాగనుంది. నిత్యం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, శని, ఆదివారం, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది. దీని ఎంట్రీ ఫీజు రూ.50గా నిర్ణయించారు. ఎగ్జిబిషన్‌కు నగర ప్రజలు భారీగా తరలి వస్తారు. దీంతో రద్దీ నివారణ కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
Nampally Exhibition | దారి మళ్లింపు
SA బజార్, జంబాగ్, బషీర్ బాగ్, బేగంబజార్, దారుసలం, మూసా బౌలి & బహదూర్‌పురా నుంచి నాంపల్లి వైపు వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ జిల్లా, ప్రైవేట్ బస్సులు అబిడ్స్, నయాపూల్, MJ మార్కెట్ బేగంబజార్ మార్గాల వైపు మళ్లించనున్నారు. రద్దీ సమయాల్లో MJ మార్కెట్ – గాంధీ భవన్ – నాంపల్లి జంక్షన్‌కు ప్రయాణికులు దూరంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పోలీస్ కంట్రోల్ రూమ్, బషీర్ బాగ్ వైపు నుంచే వచ్చే వాహనాలను AR పెట్రోల్ పంప్, BJR విగ్రహం వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
సందర్శకులు ఆర్టీసీ బస్సులు, హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro Rail) ఉపయోగించుకోవాలని సూచించారు. దీంతో వాహనాల రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. సురక్షిత క్రాసింగ్ కోసం, గాంధీ భవన్ మెట్రో వంతెన, లిఫ్ట్‌లను ఉపయోగించాలన్నారు. కాలినడకన రోడ్లు దాటొద్దని హెచ్చరించారు.