అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nalgonda collector | నల్గొండ జిల్లా పరిపాలనలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నల్గొండ Nalgonda జిల్లాలో పనిచేసి ఇటీవల బదిలీ అయిన ఇద్దరు కలెక్టర్లపై ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ప్రత్యేకంగా ఆరా తీస్తుండటం చర్చనీయాంశంగా మారింది. బదిలీకి ముందు ఆమోదం పొందిన కొన్ని కీలక ఫైల్స్, నిర్ణయాలపై ఉన్నత స్థాయిలో పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Nalgonda collector | బదిలీకి ముందు క్లియర్ చేసిన ఫైల్స్‌పైనే అనుమానాలు..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కలెక్టర్ల బదిలీకి ముందు క్లియర్ చేసిన కొన్ని భూసంబంధ, మౌలిక సదుపాయాల, అనుమతుల దస్త్రాల కదలికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వేగంగా చేపట్టిన కొన్ని కీలక నిర్ణయాలు, వాటి వెనుక జరిగిన ప్రక్రియపై సీఎంఓ దృష్టి సారించినట్లు సమాచారం.
ఫైల్స్ కదపడంలో చక్రం తిప్పిన అధికారులు..
కొంత మంది మధ్యస్థాయి అధికారులు సదరు దస్త్రాలను వేగంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, సరైన పరిశీలన లేకుండానే కొన్ని దస్త్రాలు క్లియర్ చేశారా..? అనే కోణంలో ప్రభుత్వం విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
పూర్తి నివేదికలకు ఆదేశాలు
సంబంధిత శాఖల ద్వారా పూర్తి సమాచారం, దస్త్రాల నోటింగ్స్, నిర్ణయాల నేపథ్యంపై సమగ్ర నివేదికలు తెప్పించేందుకు సీఎంఓ ఆదేశించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర అనుబంధ శాఖల నుంచి దస్త్రాల కదలికల వివరాలు సేకరిస్తున్నారు.
పరిపాలనపై ప్రభావం..
నల్గొండ జిల్లా పరిపాలనపై ఈ వ్యవహారం తాత్కాలికంగా ఒత్తిడి పెంచినప్పటికీ, పారదర్శక పాలన ఉండాలనే సర్కారు వైఖరికి ఇది నిదర్శనమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా పరిపాలన సజావుగా ఉన్నప్పటికీ.. గత నిర్ణయాలపై జరుగుతున్న సమీక్ష ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.