అక్షరటుడే, వెబ్డెస్క్ : Konda Surekha | సినీ హీరో నాగార్జున (Nagarjuna) కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖ (Minister Surekha)పై పరువు నష్టం దావాను ఆయన ఉపసంహరించుకున్నారు. గతంలో నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇటీవల బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో నాగార్జున కేసును వెనక్కి తీసుకున్నారు
మంత్రి కొండా సురేఖ గతంలో కేటీఆర్ గురించి మాట్లాడుతూ.. నాగార్జున కుటుంబంపై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నాగ చైతన్య, నాగార్జున, సమంత గురించి ఆమె ఆ సమయంలో మాట్లాడారు. దీనిపై అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. గురువారం సైతం కోర్టు విచారణ చేపట్టింది.
Konda Surekha | క్షమాపణ చెప్పడంతో..
గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి సురేఖ ఇటీవల ఎక్స్ వేదికగా పశ్చాత్తాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమె నాగర్జున కుటుంబానికి క్షమాపణ చెప్పారు. “నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యల వల్ల వారు మనస్తాపానికి గురై ఉంటే చింతిస్తున్నాను” అని పేర్కొన్నారు. అలాగే.. “ఆ వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నాను” అని ఆమె స్పష్టం చేశారు. దీంతో నాగార్జున కేసును విత్ డ్రా చేసుకున్నారు. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 280 కింద కేసును ఉపసంహరించుకుంటున్నట్లు ఫిర్యాదుదారు నాగార్జున కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు గురువారం కేసును ఉపసంహరించుకున్నట్లుగా కొట్టివేసింది.
