అక్షరటుడే, వెబ్డెస్క్ : Akkineni Nagarjuna | ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీలకు చెందిన ఫేక్ ఫొటోలు, వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వివాదాలు సృష్టించడం పెరిగిపోయింది.
డీప్ ఫేక్లతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల పలువురు ప్రముఖులు కోర్టుల్ని, పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున (Hero Akkineni Nagarjuna) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Akkineni Nagarjuna | నాగ్ సీరియస్..
తన అనుమతి లేకుండా సోషల్ మీడియా కంటెంట్లలో తన పేరు, ఫొటోలను ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, వ్యక్తిత్వ హక్కులను కాపాడేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పిటిషన్ను విచారించిన జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ.. నాగార్జున వ్యక్తిత్వ హక్కులను రక్షించే దిశగా ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి వారు కూడా ఇలాంటి సమస్యలపై ఢిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆశ్రయించగా, అనుమతి లేకుండా వారి పేర్లు, ఫొటోలు వాడరాదని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున కూడా వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం కోర్టును ఆశ్రయించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.