అక్షరటుడే, హైదరాబాద్: Myrmicophobia | చీమల (ants) కు భయపడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి Sangareddy జిల్లా అమీన్పూర్ ఠాణా పరిధిలో వెలుగుచూసింది.
సీఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన టెకీ ద్యావనపల్లి శ్రీకాంత్ కు.. 2022లో అదే సిటీకి చెందిన మనీష(25)తో పెళ్లి జరిగింది.
వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ఈ కుటుంబం గత కొంతకాలంగా పటాన్చెరు Patancheru మండలం అమీన్పూర్ Aminpur పరిధి నవ్య హోమ్స్‌లో ఉంటున్నారు.
Myrmicophobia | చిన్నప్పటి నుంచి మిర్మికోఫోబియా
కాగా, మనీషకు చిన్నప్పటి నుంచి మిర్మికోఫోబియా (చీమలంటే భయం) ఉంది. ఈ మేరకు మంచిర్యాలలో సైకాలజిస్టు (psychologist) తో కౌన్సెలింగ్ కూడా తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ రోజు మాదిరే ఈ నెల 4న విధులకు వెళ్లి, సాయంత్రం వచ్చారు. ఇంటి లోపల గడియ పెట్టి ఉంది. ఎంతకీ మనీష తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి శ్రీకాంత్ తలుపులను బద్దలు కొట్టారు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. మనీష ఉరేసుకొని కనిపించారు.
మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్లో ‘శ్రీ అయామ్ సారీ.. చీమలతో నేను బతక లేకపోతున్నా.. మన పాప జాగ్రత్త. తిరుపతి, అన్నవరం మొక్కులు తీర్చు. ఎల్లమ్మతల్లికి ఒడిబియ్యం పోయడం మరిచిపోవద్దు..’ అని రాసి ఉంది.
సూసైడ్‌కు ముందు మనీష ఇంటిని శుభ్రం చేస్తానని చెప్పి, పాపను బంధువుల ఇంట్లో వదిలి పెట్టి వచ్చారు. ఇల్లు శుభ్రం చేస్తుండగా.. చీమలను చూసి భయపడి ఉండొచ్చని, లేదంటే చీమల ఫోబియాతో ముందే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, పాపను బంధువుల ఇంట్లో వదిలి పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మనీష తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టారు.
