అక్షరటుడే, వెబ్‌డెస్క్: Donald Trump | ప్రపంచ వేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే స్టేజ్ మూమెంట్స్ ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆయన సభల్లో చేస్తూ ఉండే డ్యాన్స్ స్టెప్పులు అభిమానులకు సరదాగా అనిపిస్తే, విమర్శకులకు మాత్రం ఆశ్చర్యంగా మారతాయి.
అయితే ఆ డ్యాన్స్‌పై తన ఇంట్లో మాత్రం అంతగా ఆదరణ లేదని తాజాగా ట్రంప్ స్వయంగా వెల్లడించారు. వాషింగ్టన్‌లోని కెన్నెడీ సెంటర్ (Kennedy Center)లో రిపబ్లికన్ నేతలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా ట్రంప్ సరదా వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల ప్రచారాల్లో వైఎంసీఏ పాటకు చేసే డ్యాన్స్ గురించి ప్రస్తావిస్తూ, అది తన భార్య మెలానియాకు అస్సలు నచ్చదని నవ్వుతూ చెప్పారు.
Donald Trump | మెలానియాకి నచ్చదు..
అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా డ్యాన్స్ చేయడం సరికాదని ఆమె తరచూ అంటుంటుంది అంటూ మెలానియా (Melania)ను అనుకరిస్తూ చెప్పడంతో సభలో నవ్వులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolás Maduro) తన డ్యాన్స్‌ను అనుకరించిన విషయాన్నీ ట్రంప్ గుర్తు చేసుకున్నారు. మదురో తన స్టెప్పులను కాపీ చేయడానికి ప్రయత్నించాడని వ్యాఖ్యానించిన ట్రంప్, అదే సమయంలో అతడిపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అయితే వెంటనే టోన్ మార్చి, తన డ్యాన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి సరదాగా మాట్లాడారు. మెలానియా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయినా, ఆమె ఎలా స్పందిస్తుందో ట్రంప్ వేదికపై నటించి చూపించారు.
“డార్లింగ్… ఇది అధ్యక్షుడికి తగదు” అంటూ మెలానియా తరహాలో మాట్లాడటం ప్రేక్షకులను మరింత అలరించింది. అలాగే ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లపై తాను చేసే హావభావాలు కూడా మెలానియాకు నచ్చవని, అవి చాలా అతిగా ఉంటాయని ఆమె అంటుందని చెప్పారు. అయితే చివరికి ట్రంప్ తన స్టైల్‌లోనే వ్యాఖ్యానిస్తూ, “నా డ్యాన్స్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారు. నచ్చకపోయినా నవ్వుతారు” అని అన్నారు. మెలానియా విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని చెప్పినా, ఆమె మాటలకు మాత్రం తాను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని చెప్పడంతో ఈ ప్రసంగం సరదా మూడ్‌లో ముగిసింది.