అక్షరటుడే, కామారెడ్డి: Chandrasekhar Reddy | రాజకీయ కుట్రలో భాగంగానే పేలుడు పదార్థాల కేసులో తనను అరెస్ట్ చేశారని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి(Chandrasekhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ వెనక ఓ పెద్దమనిషి హస్తం ఉందని ఆరోపించారు. గురువారం రాత్రి బెయిల్‌పై వచ్చిన తర్వాత శుక్రవారం తన కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ నెల 3న జిల్లా కేంద్రంలో లభించిన జిలెటిన్ స్టిక్స్(Gelatin sticks), డిటోనేటర్స్(Detonators) కేసులో తన పేరు చేర్చారని తెలిసిందన్నారు. దీంతో ఈ నెల 5న సీఐ నరహరి(CI Narahari)కి ఫోన్ చేసి శ్రీవారి వెంచర్ 1800 ఎకరాలకు సంబంధించిన పత్రాలను పంపడం జరిగిందన్నారు. తన పేరుమీద ఇంచు భూమి కూడా లేదని సీఐకి తెలపగా తిరిగి రాత్రి 8 గంటలకు సీఐ తనకు ఫోన్ చేసి స్టేషన్‌కు వచ్చి కలవాలని చెప్పడంతో వెంటనే వెళ్లానని తెలిపారు.
తాను వెళ్లేసరికి స్టేషన్లో ఏఎస్పీ చైతన్య రెడ్డి(ASP Chaitanya Reddy) కూడా ఉన్నారని, ఏఎస్పీకి కూడా తన పేరున ఎలాంటి భూమి లేదని సంబంధిత పత్రాలు ఇవ్వడం జరిగిందని వివరించారు. రాత్రి 9 గంటలకు రూరల్ సీఐ రామన్(Rural CI Raman) వచ్చి ఎస్పీ మీతో మాట్లాడుతారట వెళ్దామని చెప్పి ఓ ప్రైవేట్ వాహనంలో తనను ఎస్పీ కార్యాలయం(SP Office) వైపు కాకుండా నేరుగా హైవే వైపు మళ్లించారని చెప్పారు.
ఇదే విషయాన్ని తాను సీఐని అడిగితే మళ్లీ వెంచర్‌కు సంబంధించిన ప్రశ్నలే అడిగితే సమాధానం చెప్పానన్నారు. తనను నేరుగా రాత్రి 12 గంటలకు బాన్సువాడ(Banswada) తీసుకెళ్లి ప్రాథమిక పాఠశాలలో కూర్చోబెట్టి మళ్లీ ప్రశ్నలు అడిగారని తెలిపారు. అక్కడి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నామని అప్పుడు చెప్పారన్నారు. రాత్రి 3 గంటలకు బిచ్కుంద జడ్జి వద్ద హాజరు పరిచారని, ఉదయం 6 గంటలకు నిజామాబాద్ సబ్ జైలుకు తీసుకెళ్లారని వివరించారు. ఈ మొత్తం వ్యవహారం రాజకీయ కుట్రతోనే జరిగిందని స్పష్టం చేశారు.
Chandrasekhar Reddy | సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం
సోషల్ మీడియాలో ఓ మాజీ కౌన్సిలర్ తనపై దుష్ప్రచారం చేశారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. రాత్రి 8 గంటలకు ఇంట్లో నుంచి తానే స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి పూర్తిగా వాళ్లతోనే ఉన్నానని, ఎఫ్ఐఆర్(FIR)లో మాత్రం తాను తప్పించుకుని తిరుగుతున్నానని, అశోక్ నగర్ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుకున్నారని పొందుపరచడం ఎంతవరకు సమంజసమో పోలీసులు చెప్పాలన్నారు. నాలాంటి వారి పట్లనే పోలీసులు ఇలా ప్రవర్తిస్తే సామాన్య ప్రజల పట్ల ఎలా ఉంటారోనని అనుమానం వ్యక్తం చేశారు. అరెస్ట్ రోజు తనను తానుగా వచ్చానా.. ? పట్టుకుని అరెస్ట్ చేసారా పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై భూమి లేదని తెలిసినా కేసులో చేర్చారన్నారు.
Chandrasekhar Reddy | ఓ పెద్దమనిషి ఇదంతా నడిపించారు
తన అరెస్టు వెనుక ఓ 70 ఏళ్ల పెద్దమనిషి వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్(High Command) దృష్టికి కూడా తీసుకెళ్లానని, పార్టీ తన పట్ల సానుకూలంగా ఉందన్నారు. తన ఎదుగుదలను ఓర్వలేక తన ప్రతిష్టకు భంగపరిచిన వారికి ప్రజలు, దేవుడు బుద్ధి చెప్తారని తెలిపారు. ఐపీఎస్ స్థాయి అధికారి తనపట్ల ఇలా వ్యవహరించడం సరికాదని, పోలీసుల వ్యవహార శైలిపై నేరుగా ఐజీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
Chandrasekhar Reddy | సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతా
పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మీపై రాష్ట్ర కమిటీ(State Committee)కి ఫిర్యాదు చేశారా అని విలేకరులు ప్రశ్నించగా.. తాను ఏ తప్పు చేయలేదని తెలిపారు. తనపై కుట్రలు చేసిన పెద్ద మనిషి, అతని కొడుకు, తమ్ముడు, అన్న కొడుకు అందరి వివరాలు తనవద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు ఆధారాలతో సహా వారిపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.