అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mustafizur Rahman | రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తనను జట్టు నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్పందించాడు. ఐపీఎల్ 19వ ఎడిషన్‌లో అతని భాగస్వామ్యంపై వివాదం నెలకొనడంతో, ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కేకేఆర్ ఫ్రాంచైజీకి ఆదేశాలు జారీ చేసింది.
ఈ పరిణామాలపై స్పందించిన 30 ఏళ్ల ముస్తాఫిజుర్, “వారు నన్ను విడుదల చేస్తే నేను ఏం చేయగలను?” అంటూ తన అసహాయతను వ్యక్తం చేశాడు. భారత్–బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని అతనికి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Mustafizur Rahman | రూ.9.20 కోట్లకు కొనుగోలు
ఈ వివాదానికి నేపథ్యంగా బంగ్లాదేశ్‌లో (Bangladesh) ఇటీవల జరిగిన ఓ హిందూ వ్యక్తి హత్య ఘటన నిలుస్తోంది. ఈ సంఘటన అనంతరం బీసీసీఐతో పాటు కేకేఆర్ యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ముస్తాఫిజుర్‌ను జట్టులో కొనసాగించడంపై పలు వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో, కేకేఆర్ సహ యజమాని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా విమర్శల పాలయ్యారు. ఈ పరిణామాలన్నీ కలసి చివరకు ముస్తాఫిజుర్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. గత నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, చివరికి కేకేఆర్ ఈ ఎడమచేతి వాటం పేసర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అతని కనీస ధర కేవలం రూ.2 కోట్లే కావడం విశేషం. అయితే వేలంలో కొనుగోలు చేసిన నెల రోజుల్లోనే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఈ విషయంలో బీసీసీఐ అధికారికంగా స్పందించింది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నమెంట్‌కు (IPL Tournament) ముందే ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని కేకేఆర్‌కు ఆదేశించినట్లు తెలిపింది. అవసరమైతే అతని స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసుకునేందుకు ఫ్రాంచైజీకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ, “బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులను గమనించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని కేకేఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఒకవేళ కేకేఆర్ భర్తీ ఆటగాడిని కోరితే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. అలాగే, “ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని కేకేఆర్‌కు సూచించాం. త్వరలోనే ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన వస్తుంది” అని సైకియా వెల్లడించారు. ఈ నిర్ణయం ఐపీఎల్ వర్గాల్లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోనూ చర్చనీయాంశంగా మారింది.