అక్షరటుడే, వెబ్‌డెస్క్: Laddu Auction | దేశమంతటా వినాయక చవితి ఉత్సవాలు ఉత్సాహభరితంగా, భక్తి శ్రద్ధలతో సాగాయి. ఈ సందర్బంగా అనేక ప్రాంతాల్లో గణేశ్ లడ్డూ వేలంపాటలు (Ganesh Laddu Auction) నిర్వహించారు. లడ్డూ వేలంపాట అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్ గణపతి లడ్డూ.
1994లో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ (Balapur Ganesh Laddu) వేలంపాట ఈ ఏడాది కూడా భారీ రేటు దక్కించుకుంది. ఈసారి బాలాపూర్ గణేశుడి లడ్డూ ఏకంగా రూ. 35 లక్షలకు వేలంలో అమ్ముడుపోయింది. లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి ఈ లడ్డూని సొంతం చేసుకున్నారు. వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Laddu Auction | ముస్లిం మహిళపై ప్రశంసలు..
గణేశ్ ఉత్సవాలు మతపరంగా కాకుండా, భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించేలా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దానికి నిదర్శనంగా ఒక గొప్ప ఉదంతం వెలుగు చూసింది. నిర్మల్ జిల్లా (Nirmal District)కుంటాల మండలంలోని అంబకంటి గ్రామంలో వినాయక నిమజ్జన సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో స్థానిక ముస్లిం కుటుంబం (Muslim Family) పాల్గొనడం విశేషం.
ఈ వేలంపాటలో ఏడో తరగతి విద్యార్థి కే. రెహాన్ రూ. 1,111కు లడ్డూని సొంతం చేసుకున్నాడు. ఈ ఘటన గ్రామస్తుల్లో ఎంతో ఆనందాన్ని కలిగించింది. మతపరమైన భేదభావాలకు అతీతంగా రెహాన్ చూపిన ఐక్యత భావన మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అందరూ ప్రశంసిస్తున్నారు. రెహాన్‌ను గ్రామస్థులు అభినందించారు.
మరోవైపు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ కాలనీలో వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం పాట నిర్వహించగా, ముస్లిం మహిళ అమ్రిన్ (Amrin).. రూ.1,88,888లకి గణపతి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. అలానే బోరబండలో ముస్లిం వ్యక్తి లడ్డూ వేలంలో పాల్గొని అందరినీ ఆకర్షించారు. రాజ్‌నగర్‌లోని కింగ్స్ టీమ్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపంలో లడ్డూ వేలం పాట నిర్వహించగా, సయ్యద్ హమాన్ రసూల్ (Rasool) అనే రియల్టర్ వేలంలో పాటలో చురుకుగా పాల్గొని చివరికి రూ. 55 వేలకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు. రసూల్ గతంలోనూ ఇలానే వేలం పాటలో పాల్గొని గణేశుడి లడ్డూను సొంతం చేసుకున్నారు.