అక్షరటుడే, వెబ్‌డెస్క్:Elon Musk | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్(SpaceX)కు మరోసారి పరాభవమే మిగిలింది. అంతరిక్ష రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోన్న ఆ సంస్థ ప్రయోగం మరోమారు విఫలమైంది. సుదూర అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్‌రూపొందించిన స్టార్ షిప్ మెగా రాకెట్(Starship Mega Rocket) మార్గమధ్యలోనే పేలిపోయింది. ఎలోన్ మస్క్ నేతృత్వంలోని ఈ సంస్థ గతంలో చేపట్టిన ఇలాంటి ప్రయోగాలు రెండు కూడా విఫలమయ్యాయి. గత పేలుడు వైఫల్యాల నుంచి తిరిగి పుంజుకునే సామర్థ్యాన్ని పరీక్షించడానికి స్పేస్‌ఎక్స్ మూడోసారి చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. తొలుత విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లినా.. అరగంట తర్వాత మార్గమధ్యలోనే అది పేలిపోయింది.
Elon Musk | వరుస వైఫల్యాలు..
అంతరిక్షంలో సుదూర యాత్రల కోసం కొన్నేళ్లుగా స్పేస్ ఎక్స్ ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలో గత జనవరి, మార్చిలో రెండుసార్లు చేసిన రాకెట్ ప్రయోగాలు వైఫల్యం చెందాయి. గ్రౌండ్ కంట్రోల్(Ground Control)తో సంబంధాలు తెగిపోయి గాల్లోనే పేలిపోయాయి. ఈ నేపథ్యంలో స్పేస్ ఎక్స్ తాజాగా మూడో ప్రయత్నం చేపట్టింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్ తీరంలో నుంచి స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ మెగా రాకెట్‌ను ప్రయోగించింది. పునర్వియోగం కోసం అభివృద్ధి చేసిన 123 మీటర్ల పొడవైన ఈ భారీ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరింది. తొలుత నిర్దేశించిన ప్రకారమే ప్రయాణించిన స్టార్‌షిప్ రాకెట్.. ఆ తర్వాత గ్రౌండ్ కంట్రోల్ నుంచి బూస్టర్‌కు సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రణాళిక ప్రకారం నియంత్రిత్వ రీతిలో భూమిని తాకకుండా సముద్రంలో పడిపోయింది.
Elon Musk | కక్షలోకి చేరని శాటిలైట్లు..
అయితే, అంతరిక్షంలోకి చేరుకున్న స్టార్‌షిప్(Starship).. తర్వాత శాటిలైట్లనును నిర్ణీత కక్షలోకి ప్రవేశ పెట్టలేకపోయింది. పేలోడ్‌లోని శాటిలైట్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా తలుపులు తెరుచుకోలేదు. దాదాపు అరగంట తర్వాత స్టార్‌షిప్ కూడా నియంత్రణ కోల్పోయింది. ఈ క్రమంలో భూ వాతావరణంలోకి ప్రవేశించింది. కాసేపటికే హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. తాజా వైఫల్యంపై స్పేస్ ఎక్స్ స్పందిస్తూ.. దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామని గత రెండు ప్రయోగాల కంటే ఈసారి రాకెట్ ఎక్కువ దూరం ప్రయాణించిందని పేర్కొంది.
Elon Musk | మార్స్‌ను చేరుకునేందుకు కీలకం..
అంతరిక్షంలో స్పేస్ ఎక్స్ కు అనేక లక్ష్యాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది మార్స్‌కు చేరుకోవడం. అందుకు కీలకమైనది స్టార్‌షిప్ ప్రయోగం. ఇది విజయవంతమైతే ప్రజలను మార్స్‌కు తీసుకెళ్లి రావాలన్నది మస్క్(Elon Musk) ఆలోచన. ఇందుకోసం స్టార్‌షిప్ నౌక ఉపయోగపడుతుంది. 2026 నాటికి స్పేస్‌ఎక్స్ తన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా ఇంక్. నిర్మించిన రోబోలను స్టార్‌షిప్ రాకెట్ ద్వారా అరుణగ్రహానికి పంపుతుందని మస్క్ ఇటీవల ప్రకటించాడు. మరోవైపు, స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్‌తో చంద్రునిపై వ్యోమగాములను దింపడానికి దాదాపు 4 బిలియన్ డాలర్ల విలువైన NASAతో ఒప్పందం చేసుకుంది.