అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | కామారెడ్డిని నేర రహిత జిల్లాగా (crime-free district) మార్చడానికి పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు.
జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే కొన్ని ఘటనల్లో కేసుల సంఖ్య తగ్గిందని, మరికొన్ని పెరిగాయన్నారు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 698 ఆస్తి సంబంధిత నేరాలు జరిగాయని తెలిపారు. ఇందులో 34 హత్యలు, 43 కిడ్నాప్, 67 రేప్ కేసులు, 470 రోడ్డు ప్రమాదం కేసులు ఉన్నాయన్నారు. గతేడాది 37 హత్యలు జరిగితే ఈ సంవత్సరం 34 జరిగాయన్నారు. 2024 లో మొత్తం 720 చోరీలు జరగ్గా ఈ ఏడాది 658 దొంగతనాలు జరిగినట్లు వెల్లడించారు. ఇందులో 47 శాతం కేసుల ఛేదించి 40 శాతం సొత్తు రికవరీ చేశామని తెలిపారు.
SP Rajesh Chandra | మహిళా సంబంధ నేరాలు
గతేడాది మహిళా సబంధిత నేరాలు 622 జరిగితే ఈ సంవత్సరం 565 జరిగాయన్నారు. ఇందులో 16 హత్యలు, 2 వరకట్న మరణాలు, 67 రేప్ కేసులు, 2 గృహ హింస ఆత్మహత్యలు, 247 గృహహింస కేసులు, 109 లైంగిక వేధింపులు, 40 కిడ్నాప్ (kidnappings) ఉన్నాయని తెలిపారు. జిల్లాలో షి టీమ్స్ ద్వారా 1,712 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
SP Rajesh Chandra | ఉపాధ్యాయులపై కేసులు
పాఠశాలల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ద్వారా రామారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, భిక్కనూర్, గాంధారి, నిజాంసాగర్, నస్రుల్లాబాద్ మండలాలలో పాఠశాల ఉపాధ్యాయులపై కేసుల నమోదు చేశామన్నారు. 2024 లో రోడ్డు ప్రమాదాలలో 262 మరణాలు చోటుచేసుకోగా.. ఈ సంవత్సరం 200 మంది చనిపోయారని తెలిపారు. బ్లాక్స్ స్పాట్స్ గుర్తించడంతో పాటు ఎప్పటికప్పుడు వాహనాల చాలాన్ల ద్వారా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలతో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. సైబర్ నేరాలు సైతం గతేడాది 200 జరగ్గా ఈ ఏడాది 160కి తగ్గాయన్నారు. ఈ ఏడాది లోక్ అదాలత్ (Lok Adalat) ద్వారా రూ. 1,07,31,518 బాధితులకు అందించినట్లు తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాల రవాణా, వ్యాపారం చేసిన వారిపై గత సంవత్సరం 35 కేసులు నమోదు కాగా.. ఈ సారి 23 కేసులు పెట్టామన్నారు.
SP Rajesh Chandra సాంకేతిక పరిజ్ఞానంతో..
జిల్లాలో నమోదైన పలు కేసుల్లో 12 కేసులలో జీవిత ఖైదు, 2 కేసులలో 20 ఏళ్ల లోపు శిక్షలు, ఒక కేసులో పదేళ్ల లోపు శిక్ష, 3 కేసులలో ఏడేళ్ల లోపు శిక్షలు, 3 కేసులలో ఐదేళ్లలోపు శిక్షలు పడ్డాయని ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 281 మంది నేరస్తులను గుర్తించామన్నారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం రూ.2.75 కోట్ల విలువైన 1,722 మొబైల్స్ రికవరీ చేశామని వెల్లడించారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా జులై 1 నుంచి 31 వరకు 108 మంది బాల కార్మికుల గుర్తించామని తెలిపారు. 1,041 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు చేయడంలో పోలీసులు సఫలమయ్యారని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా అమాయకులను టార్గెట్ చేసుకుని నకిలీ కరెన్సీ వ్యాపారం చేస్తున్న ముఠాకు చెక్ పెట్టి 8 రాష్ట్రాలలో ఆపరేషన్ ద్వారా 13 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసులో 8 మందిపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. జాతీయ రహదారిపై దారి దోపిడీకి పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర పార్థీ గ్యాంగ్ ముఠాలో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. భిక్కనూరు మండలంలో చోరీలకు పాల్పడిన కంబర్ భట్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలో ఐదుగురిని, తాడ్వాయి, గాంధారి, లింగంపేట, బాన్సువాడ పరిధిలో ఇళ్లలో దోపిడీకి పాల్పడిన గడ్డపార గ్యాంగుకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు.