Homeక్రైంKarnataka | ఇన్సూరెన్స్​ డబ్బుల కోసం హత్య.. తర్వాత ఏం జరిగిందంటే?

Karnataka | ఇన్సూరెన్స్​ డబ్బుల కోసం హత్య.. తర్వాత ఏం జరిగిందంటే?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | ఇన్సూరెన్స్ (Insurance)​ డబ్బుల కోసం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు.

కర్ణాటకలోని హోస్పేట్ (Hospet) శివారులో సెప్టెంబర్​ 28న ఎక్సెల్​ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొని హోస్పేట్​కు చెందిన గంగాధర అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే గంగాధర కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయన బైక్​ నడిపే పరిస్థితి లేదు. అయినా కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ఆయన భార్య అనుమానం వ్యక్తం చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీమా సొమ్ము కోసం ఆయనను హత్య చేసినట్లు గుర్తించారు. దీని వెనక ప్రభుత్వ వైద్య కాలేజీ ప్రిన్సిపల్​, బ్యాంకు ఉద్యోగి ఉన్నట్లు తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

Karnataka | ప్లాన్​ బెడిసి కొట్టడంతో..

గంగాధర పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఇలా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రమాద బీమా, జీవిత బీమా చేయించి డబ్బులు క్లెయిమ్​ చేయడానికి కొందరు ముఠాగా ఏర్పడ్డారు. ఆరుగురు కలిసి గ్యాంగ్​ ఏర్పాటు చేసి డబ్బులు పంచుకుంటున్నారు. వీరికి గంగావతి ప్రభుత్వ కళాశాల (Gangavathi Medical College) వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణప్ప మాస్టర్ మైండ్‌గా వ్యవహరించారు. ఆయన బ్యాంకు ఉద్యోగి యోగరాజ్ సింగ్, గోసంగి రవి, అజయ్, రియాజ్‌ ముఠాగా ఏర్పడి పక్షవాతంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధరపై బీమా చేయించారు. ఆయనపై రూ.5 కోట్ల జీవిత బీమా, రూ.25 లక్షల ప్రమాద బీమా చేయించారు. ప్రీమియం డబ్బులను కూడా వారే కట్టారు. అయితే ఆయన చనిపోతే డబ్బులు నామినీకి వస్తాయి. నామినీ రక్త సంబంధికులు ఉండాలి కాబట్టి, హులిగెమ్మ అనే ఓ మహిళను ఒప్పించి గంగాధర భార్యగా నమోదు చేశారు. ఈ మేరకు నకిలీ పత్రాలు కూడా సమర్పించారు.

Karnataka | చనిపోవడం లేదని..

గంగాధరపై ఈ ముఠా బీమా చేయించారు. అయితే ఆయన ఎంతకు చనిపోవడం లేదు. దీంతో ఎలాగైన చంపాలని పథకం వేశారు. ఈ మేరకు ఆయనను కిడ్నాప్​ చేసి, హత్య చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించారు. బీమా డబ్బులతో పారిపోవాలని పథకం వేశారు. అయితే మృతుడి భార్య ఫిర్యాదుతో నిందితులు దొరికిపోయారు. తన భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడని, వాహనం నడపలేడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు. గతంలో సైతం ఇలా ఏమైనా హత్యలు చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.