అక్షరటుడే, వెబ్‌డెస్క్: Government Schools Condition | మున్సిపాలిటీల్లో ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా మారాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. పలు బడుల్లో విద్యార్థులు తక్కువగా.. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారన్నారు.
జాగృతి కార్యాలయంలో కవిత మంగళవారం మున్సిపల్ ఎన్నికల (Municipal Elections)పై మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లా మున్సిపల్ ఎన్నికలు సైతం పార్టీ గుర్తులు లేకుండా జరిగితే బాగుంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార శైలిపై ఆమె విమర్శలు చేశారు. అన్ని పార్టీలు అసలు సమస్యలను పక్కన పెట్టి ప్రజల దృష్టిని మరల్చే యత్నం చేశాయన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రచారం కోసం మహబూబ్‌నగర్ (Mahabubnagar) వచ్చారని చెప్పారు. అయితే అక్కడ ఇప్పటికి తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాని గురించి ఎవరు మాట్లాడటం లేదన్నారు.
Government Schools Condition | వసతులు కరువు
పట్టణాల్లోని బస్తీ దవాఖానాల్లో కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని కవిత చెప్పారు. పట్టణాల్లో గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోయిందన్నారు. దాని గురించి ఎవరు మాట్లాడటం లేదన్నారు. మంచి వాళ్లను ఎన్నుకోవాలని కవిత కోరారు. సింహం గుర్తుపై పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క మున్సిపాలిటీకి మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. అది కూడా గుంట నక్క హరీశ్‌రావు సిద్దిపేట (Siddipet)కు నిధులు విడుదల చేశారన్నారు. కాంగ్రెస్ ఉన్నా.. బీఆర్ఎస్ ఉన్నా నిధులు మాత్రమే వారికే మంజూరు అవుతున్నాయని పేర్కొన్నారు.
Government Schools Condition | బీసీలకు నిధులు కేటాయించాలి
హామీల అమలుకు ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల నిధుల్లో కోత పెట్టి.. కాంట్రాక్టర్లకు మాత్రం చెల్లింపులు చేస్తోందని విమర్శించారు. బీసీలకు బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించాలన్నారు. పెన్షన్లు డబుల్ చేయాలని, పట్టణాల్లోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రైతు భరోసా (Rythu Bharosa), రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వడానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎవరు అధికారంలో ఉంటే ఒవైసీ సోదరులు వారి వెంట తిరుగుతారని కవిత అన్నారు. రాహుల్ గాంధీని వ్యతిరేకించే అసదుద్దీన్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో (Jubilee Hills Elections) కాంగ్రెస్‌కు సపోర్ట్ చేశారని గుర్తు చేశారు.