అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన మున్సిపల్ జవాన్ (municipal worker) గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన భీమ్‌గల్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. తోటి ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న నిత్యం మాదిరిగానే ఉదయం విధులకు హాజరయ్యారు. అయితే కొద్దిసేపటికే ఛాతీలో నొప్పిగా ఉందని సహచరులకు చెప్పి ఇంటికి వెళ్లారు. ఇంటికి చేరుకున్న కాసేపటికే పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు.
రాజన్న మృతి విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయన నివాసానికి చేరుకుని మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ (Municipal Commissioner Gopu Gangadhar) రూ.10 వేలు, మున్సిపల్ ఉద్యోగుల యూనియన్ తరఫున మరో రూ. 5వేలు ఆర్థికసాయం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘం యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ మాట్లాడుతూ.. 2001 నుంచి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో జవాన్‌గా సేవలందించిన రాజన్న మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, అర్హతను బట్టి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి కార్మికులంతా అండగా ఉంటారని పేర్కొన్నారు.