అక్షరటుడే, బోధన్: Bodhan Municipality | సాక్షాత్తు మున్సిపల్ కార్యాలయంలోనే అధికారులు బాహాబాహికి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన బోధన్ మున్సిపాలిటీలో (Bodhan Municipality) చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఇలా కార్యాలయంలోనే (municipal office) బహిరంగంగా కొట్టుకోవడంపై పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Bodhan Municipality | మున్సిపల్ ఆవరణలోనే..
పట్టణంలోని మున్సిపల్ ఆవరణలో గురువారం ఓ ఏఈ, వాటర్ వర్క్స్‌లో పనిచేసే మరో అధికారి ఇద్దరు ఎదురెదురుగా తారసపడ్డారు. అయితే తన బైక్‌ను తీసుకొస్తున్న సమయంలో అడ్డు తప్పుకోవాలని ఓ అధికారి గట్టిగా మాట్లాడగా.. మరో అధికారి సైతం అదేస్థాయిలో సమాధానమిచ్చారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా పెరిగి షర్ట్స్ పట్టుకుని కొట్టుకునేవరకు వెళ్లింది. స్పందించిన తోటి అధికారులు, సిబ్బంది వారిని విడిపించారు.
అనంతరం వారిరువురు ఒకరిపై ఒకరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు సైతం చేసుకున్నారు. ఈ విషయమై బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను వివరణ కోరగా తనకేమీ సమాచారం లేదని పేర్కొన్నారు. అయితే గతంలోనూ సదరు ఏఈ దురుసు ప్రవర్తన కారణంగా స్ట్రీట్ లైట్ విభాగంలో పనిచేసే ఉద్యోగి ఒకరు మనస్తాపంలో నాలుగైదు రోజులు కనిపించుకుండా పోయాడని పలువురు పేర్కొన్నారు.
బోధన్ మున్సపాలిటీలో దీర్ఘకాలంగా తిష్టవేసి కూర్చున సదరు ఏఈ దురుసు ప్రవర్తనపై ఉద్యోగులు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం చేసినట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు సదరు ఏఈపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.