అక్షరటుడే, వెబ్‌డెస్క్: Municipal elections | మున్సిపల్ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శివరాత్రిలోపు ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ, ప్రమాణ స్వీకారం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Municipal elections) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఇల్లెందు, ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల (Yedulapuram municipal elections) సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివరాత్రి (Shivaratri) లోపు ఎన్నికలు, కౌంటింగ్, ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. సమయం తక్కువగా ఉన్నందున పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఫిబ్రవరి 15న శివరాత్రి ఉంది. అంటే 20 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
Municipal elections | అభివృద్ధికి నిధులు
ఏదులాపురం, ఇల్లెందు పట్టణాల అభివృద్ధికి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయమే తుది నిర్ణయం అన్నారు. వారసత్వ రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు. తన రక్త సంబంధీకులకు ఎవరికీ టికెట్లు ఇవ్వనని తెలిపారు. టికెట్ల కేటాయింపు కోసం రెండు మూడు బృందాలతో క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు.
టికెట్ రాని వారు నిరాశ చెందొద్దని ఆయన అన్నారు. అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూడొద్దన్నారు. వేరే పార్టీలోకి వెళ్తే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. టికెట్ రాని వారిని భవిష్యత్తులో కో-ఆప్షన్ సభ్యులుగా లేదా ప్రభుత్వంలోని ఇతర పదవుల ద్వారా ఏదో ఒక రూపంలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.