అక్షరటుడే, ఎల్లారెడ్డి : Municipal Election last day | మున్సిపల్ ఎన్నికల (Municipal Election)కు మరికొన్ని గంటల గడువు ఉండడంతో అభ్యర్థుల్లో కౌంట్ డౌన్ ప్రారంభమైంది. చివరి రోజు నిషా రాత్రిలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున మద్యం సీసాలు డబ్బు పంపిణీ చేస్తున్నారు.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రలోభాల జోరు సాగుతోంది. ఒక్క రాత్రి ఫలితాలను మార్చేసే అవకాశం ఉండటంతో అభ్యర్థులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణంలోని పలు వార్డుల్లో చీరలు, మంగళ హారతి.. కుంకుమ భరణి పల్లాలు పంపిణీ చేస్తున్నారు. గెలుపు కోసం అభ్యర్థులు ఓటర్లను కలుస్తూ వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ఆర్థిక బలం ఉన్న అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.10 వేలకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. గంపగుత్తగా ఓట్ల కోసం కుల సంఘాలు, మహిళా సంఘాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు.
మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ రేసులో ఉన్న అభ్యర్థులు అయితే గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎంత ఖర్చుకు అయినా వెనుకాడటం లేదు. పలుచోట్ల కొంత నగదు ఇస్తూ.. గెలిచిన తర్వాత మళ్ళీ కలుస్తామని భరోసాలు ఇస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ బాధ్యతలను ద్వితీయ శ్రేణి నాయకులు చూసుకుంటున్నారు.