అక్షరటుడే, ఎల్లారెడ్డి : Municipal Election Flag March | మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ శ్రీనివాస్ రావు (DSP Srinivas rao), ఆర్డీవో పార్థ సింహారెడ్డి అన్నారు. పోలీస్ బలగాలతో కలిసి ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణంలో సోమవారం వార్డుల్లో, గండిమసానిపేట లింగారెడ్డి పేట్, శివారు గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
Municipal Election Flag March | శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా..
శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా వారిలో నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నేపథ్యంలో ఓటర్లలో భయాందోళనకు తావులేకుండా చేయడంలో భాగంగా స్థానిక పోలీసులు, పోలీస్ బలగాలతో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించినట్లు వారు చెప్పారు. సమస్యాత్మక వార్డులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
అల్లర్లు సృష్టించాలని భావిస్తే..
ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువుల అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సరైన కారణం లేకుండా రూ.50వేల నగదు కంటే ఎక్కువ తీసుకెళ్తే సీజ్‌చేసి జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అందజేస్తామని పేర్కొన్నారు. ఫ్లాగ్‌మార్చ్‌లో మున్సిపల్ కమిషనర్ మహేష్ (Municipal Commissioner Mahesh), సీఐ సంతోష్ గౌడ్, ఎస్సైలు మహేష్, భార్గవ్, పుష్పరాజ్, సిద్ధికి, పోలీస్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.