అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Municipal Election Counting Process | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.
రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల (Counting Centers)కు తరలించారు. ఆయా మున్సిపాలిటీ పరిధిలోనే కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అవసరమైన లెక్కింపు సూపర్వైజర్లు, సహాయకులను నియమించారు. కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్ 163 అమలులో ఉంటుంది. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
Municipal Election Counting Process | పాస్ ఉంటేనే ప్రవేశం
కౌంటింగ్ సూపర్వైజర్లు, లెక్కింపు సహాయకులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే హాల్లోకి అనుమతిస్తారు. చెల్లుబాటు అయ్యే పాస్‌లతో మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. కౌంటింగ్ హాళ్ల లోపలికి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు తీసుకు వెళ్లొద్దు.
Municipal Election Counting Process | లెక్కింపు ప్రక్రియ
మొదట అధికారులు పోస్టల్ బ్యాలెట్లు (Postal Ballots) లెక్కిస్తారు. అనంతరం సాధారాణ బ్యాలెట్ పత్రాలను తీసుకుంటారు. వార్డులోని అన్ని బ్యాలెట్ పెట్టెలను ఒక్కొక్కటిగా కౌంటింగ్ టేబుల్‌కు తీసుకువస్తారు. బ్యాలెట్ పేపర్లను 25 సెట్లతో బండిల్ చేస్తారు. వార్డులోని అన్ని పోలింగ్ స్టేషన్ల బండిల్లను డ్రమ్‌లో ఉంచుతారు. ప్రతి రౌండ్లో డ్రమ్ నుంచి 1,000 బ్యాలెట్లను (40 బండిల్లు × 25 బ్యాలెట్లు) తీసుకొని ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు పంపుతారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థి, నోటా సందేహాస్పద ఓట్ల కోసం కంపార్ట్మెంట్లతో కూడిన చెక్క ట్రేలను ఉపయోగిస్తారు. ప్రతి అభ్యర్థికి చెల్లుబాటు అయ్యే 100 ఓట్లతో మళ్లీ బండిల్ చేస్తారు. రౌండ్ల వారీగా ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.