అక్షరటుడే, వెబ్‌డెస్క్: NEET Score Scam | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నీట్ స్కోర్ బాగోతం (Mumbai NEET Score Scam) వెలుగు చూసింది.
నీట్ స్కోర్‌ను తారుమారు చేస్తామంటూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.90 లక్షల వసూలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన సీబీఐ.. నిందితులు సోలాపూర్, నవీ ముంబైకి (Navi Mumbai) చెందిన సందీప్ షా, సలీం పాటిల్‌ను అరెస్ట్ చేసింది.
కాగా.. వీరు తమకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) అధికారులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి నీట్ అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. తక్కువ స్కోర్ సాధించిన అభ్యర్థుల మార్కులను తారుమారు చేయవచ్చని బాధితులకు చెప్పి నిందితులు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.
సీబీఐ అధికారులు (CBI officials) తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని పరేల్‌లోని హోటల్ ఐటీసీ గ్రాండ్ సెంట్రల్‌లో (Hotel ITC Grand Central) నిందితుడు సందీప్ నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులను కలిశాడు. నీట్ స్కోర్ తారుమారు చేసేందుకు ఒక్కో అభ్యర్థికి రూ. 90 లక్షలు డిమాండ్ చేశారు. తరువాత రూ. 87.5 లక్షలు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఈ భేటీలో తల్లిదండ్రుల రూపంలో వెళ్లిన సీబీఐ అధికారులు సందీప్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తులో సలీం పటేల్, జావేద్ అలీ పటేల్ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం సలీం, సందీప్ షాలు సీబీఐ అదుపులో ఉన్నారు.
అరెస్టయిన వ్యక్తుల మొబైల్ ఫోన్‌లను అధికారులు పరిశీలించగా.. అభ్యర్థుల వివరాలు, వారి రోల్ నంబర్లు, అడ్మిట్ కార్డులు, OMR షీట్లు, హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీల ఆధారాలతో కూడిన చాట్‌లు బయటపడ్డాయి. వీరిద్దరిని ముంబైలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు మొదట జూన్ 13 వరకు సీబీఐ కస్టడీకి ఇవ్వగా.. తరువాత జూన్ 16 వరకు పొడిగించింది.