అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mumbai Mayor Election | బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ ఎన్నికలు ఆఖరి నిమిషంలో వాయిదా పడ్డాయి. జనవరి 31న జరగాల్సిన ఈ ఎన్నిక ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ, ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన తమ గ్రూప్ నమోదు ప్రక్రియను పూర్తి చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా.. ముంబై మేయర్ పదవి కోసం బీజేపీ, షిండే శివసేన పోటీ పడుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
Mumbai Mayor Election | మహిళకు బీఎంసీ మేయర్ పోస్టు
బీఎంసీ మేయర్ పోస్టును లాటరీ పద్ధతిలో మహిళకు దక్కింది. కాగా.. జనవరి 31న ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ క్రమం బీజేపీ (BJP), శివసేన కార్పొరేటర్ల గ్రూప్ రిజిస్ట్రేషన్లను ఫైనలైజ్ కాలేదు. దీంతో మేయర్ ఎన్నికల ప్రక్రియలో అవాంతరం ఏర్పడింది. అయితే పోటీలో ఉన్న కూటములు భాగస్వామ్య ఒప్పంద పత్రాలను మున్సిపల్ సెక్రెటరీ కార్యాలయం (Municipal Secretary Office)లో సమర్పించాల్సి ఉంటుంది. ఇది పూర్తయే వరకు ఎన్నికల ప్రక్రియను చేపట్టడానికి వీలు పడదు. ఇప్పటికే ఉద్దవ్ శివసేన-ఎంఎన్ఎస్ కూటమికి చెందిన 65 మంది కార్పొరేటర్లు రిజస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. కానీ బీజేపీ-షిండే కూటమి ఇంకా పూర్తి చేయకపోవడంతో ఎన్నిక వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు ఉమ్మడి గ్రూపుగా రిజిస్టర్ చేయించుకుంటాయా.. లేదంటే వేర్వేరుగా రిజిస్ట్రర్ చేయించుకుంటాయా అనేది చర్చనీయాంశంగా మారింది.
Mumbai Mayor Election | బీజేపీ-శివసేన కూటమికి ఆధిక్యం
ఇటీవల జరిగిన బీఎంసీలో ఎన్నికల్లో (BMC Elections) బీజేపీ-శివసేన కూటమికి ఆధిక్యం సాధించాయి. గత మూడు దశాబ్దాలుగా పీఠ దక్కించుకున్న ఠాక్రేలకు బీజేపీ-షిండే శివసేన కూటమి గండి కొట్టింది. 227 మంది సభ్యులు ఉండే బీఎంసీలో.. 114 మెజారిటీ మార్క్‌గా ఉంటుంది. కాగా.. ఇందులో బీజేపీ-శివసేన కూటమి 118 సీట్లలో గెలుపొందింది. బీజేపీ 89, శివసేన 29 సీట్లు దక్కాయి. అలాగే శివసేన యూబీటీ-ఎంఎన్ఎస్ కూటమి (65+6) 71 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 24 సీట్లు, ఏఐఎంఐఎం 8 సీట్లలో గెలుపొందాయి.