అక్షరటుడే, ముంబై: Heavy Rains | ముంబై(Mumbai) భారీ వర్షాలతో అతులాకతులమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. విఖ్రోలి వెస్ట్‌లో (Vikhroli West) సమీపంలోని కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు.
సమీపంలోని కొండ ప్రాంతం నుంచి మట్టి, రాళ్లు గుడిసెపై పడ్డాయి. దీంతో పలువురు గాయపడగా, రాజవాడి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది. నగరంలోని అనేక ప్రాంతాలు తీవ్ర జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాషి, కింగ్స్ సర్కిల్, గాంధీ మార్కెట్, అంధేరి, కుర్లా. చెంబూర్ సహా ప్రాంతాలు పూర్తిగా జలమయయ్యాయి.
Heavy Rains | నీట మునిగిన రైలు పట్టాలు..
ముంబైలో రాత్రిపూట కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్‌లపైకి వర్షపు నీరు చేరింది. దీనివల్ల ఉదయం ప్రయాణ సమయాల్లో ముంబై లోకల్‌లోని అనేక లైన్లలో ఆలస్యం జరిగింది. ముంబై లోకల్ రైళ్లు (Mumbai Local Trains) ఆలస్యంగా నడుస్తున్నాయి. కుర్లా, దాదర్ మధ్య భారీ వరదల కారణంగా అప్ అండ్ డౌన్ లైన్‌లలో ఆలస్యం జరిగిందని సెంట్రల్ రైల్వే నివేదించింది. ట్రాక్‌లపై నీరు పెరగడం వల్ల రైళ్లు నెమ్మదిగా కదలాల్సి వచ్చింది. సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు ధ్రువీకరించారు.
Heavy Rains | బీఎంసీ పోలీసుల అడ్వైజరీ
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని బృహన్ ముంబై కార్పొరేషన్ (Brihan Mumbai Corporation), పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. “ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అనవసరమైన ప్రయాణాలను నివారించాలని, బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా సహాయం చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో, 100 / 112 / 103కు డయల్ చేయండి, ”అని సోషల్ మీడియాలో అడ్వైజరీ జారీ చేశారు. వర్ష ఉధృతి మధ్య అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని మరియు అనవసరమైన ప్రయాణాలను నివారించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పౌరులను హెచ్చరించింది.