అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mumbai Kidnapping | ముంబైలో ఓ వ్యక్తి 20 మంది చిన్నారులను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం చేపింది. రోహిత్ ఆర్య (Rohit Arya) అనే వ్యక్తి పిల్లలను బందీలుగా చేసుకున్నాడు. ఆడిషన్స్ పేరుతో 20 మంది చిన్నారులను కిడ్నాప్ చేయగా.. వారిని పోలీసులు సురక్షితంగా కాపాడారు.
ముంబైలోని పోవై ప్రాంతంలోని ఒక యాక్టింగ్ స్టూడియోలో రోహిత్ ఆర్య గురువారం 20 మంది పిల్లలను బందీలుగా ఉంచాడు. ఆడిషన్స్ (Auditions) కోసం అని పిలిచి వారిని బందీలుగా చేసుకున్నాడు. అనంతరం నిందితుడు ఒక వీడియో విడుదల చేశాడు. తాను ఉగ్రవాదిని కాదని, తనకు డబ్బు అవసరం లేదని అందులో పేర్కొన్నాడు. కొంతమందిని కొన్ని ప్రశ్నలు అడగడమే తనకు కావాల్సిందని, అనుమతి లేకపోతే మొత్తం ఆర్ఏ స్టూడియో (RA Studio)ను తగలబెడతానని హెచ్చరించాడు.
Mumbai Kidnapping | ఎన్కౌంటర్లో హతం..
కిడ్నాప్ విషయం తెలియగానే ముంబై పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. పిల్లలందరినీ రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆర్య నాగ్‌పూర్‌కు చెందినవాడని, చెంబూర్‌లో నివసించాడని తెలుస్తోంది. దాదాపు 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలను ఆడిషన్ కోసం స్టూడియోకు పిలిపించారని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ మానసికంగా అస్థిరంగా ఉన్నాడని, అతని చర్య వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి తదుపరి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అతడితో చర్చలు జరపడానికి ప్రయత్నించినా.. అంగీకరించకపోవడంతో.. తమ బృందం బాత్రూమ్ ద్వారా స్టూడియోలోకి ప్రవేశించిందని డీసీపీ తెలిపారు. అనంతరం అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఆర్య ఆసుపత్రిలో మరణించినట్లు సమాచారం.

