అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tech Recession | ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం ఎదుర్కొంటున్న మాంద్యం అనేక మంది ఐటీ ఉద్యోగుల జీవితాలను అనూహ్యంగా మలుపు తిప్పుతోంది. ఉద్యోగాల కోత, నియామకాల తగ్గింపు నేపథ్యంలో కొందరు పూర్తిగా భిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు.
ఈ క్రమంలో ఒక భారతీయ సాఫ్ట్వేర్ నిపుణుడు రష్యాలో జీవనోపాధి కోసం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 26 ఏళ్ల ముఖేశ్ మండల్… ఒకప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ (Software Developer)గా పనిచేసిన యువకుడు. ఏఐ, చాట్‌బాట్స్, జీపీటీ వంటి ఆధునిక టెక్నాలజీలపై మంచి అవగాహన కలిగిన అతడు, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం కూడా కలిగి ఉన్నాడు.
Tech Recession | పరిస్థితుల ప్రభావం..
అయితే గ్లోబల్ టెక్ రంగంలో ఒక్కసారిగా ఏర్పడిన మందగమనం అతడి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థిక భద్రత కోసం ముఖేశ్ రష్యా బాట పట్టాడు. ప్రస్తుతం అతడు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో మున్సిపల్ పారిశుధ్య విభాగం (Municipal Sanitation Department)లో పని చేస్తున్నాడు. ‘కొలోమియాజ్స్కోయ్’ (Kolomiyazhskoy) అనే రోడ్డు మెయింటెనెన్స్ సంస్థలో చేరిన అతడు వీధులు శుభ్రం చేయడం, చెత్త తొలగించడం వంటి పనులు నిర్వహిస్తున్నాడు. రష్యాలో కార్మికుల కొరత కారణంగా భారత్ నుంచి వచ్చిన 17 మంది బృందంలో ముఖేశ్ కూడా ఒకరు. ఈ బృందంలో రైతులు, డ్రైవర్లు, ఆర్కిటెక్టులు వంటి విభిన్న రంగాల వారు ఉన్నారు. వీరందరికీ నెలకు దాదాపు లక్ష రూబిళ్లు జీతంగా అందుతోంది. భారతీయ కరెన్సీ (Indian Currency)లో ఇది సుమారు రూ. 1.1 లక్షలకు సమానం. అదనంగా ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాలను కూడా సంస్థే కల్పిస్తోంది.
తన నిర్ణయంపై ముఖేశ్ స్పష్టంగా మాట్లాడాడు. “పని చిన్నదా పెద్దదా కాదు… పని చేసే తత్వమే ముఖ్యం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు జీవనోపాధి కోసం తీసుకున్న ఆచరణాత్మక నిర్ణయమిది. ఏడాది పాటు ఇక్కడ పనిచేసి కొంత పొదుపు చేసి తిరిగి భారత్‌కు వెళ్లాలని భావిస్తున్నాను” అని చెప్పాడు. మొత్తానికి టెక్ రంగంలో మాంద్యం ఎంత తీవ్రంగా ఉందో చూపించే ఉదాహరణగా ముఖేశ్ కథ నిలుస్తోంది. ఒకవైపు ఉన్నత విద్య, టెక్నికల్ స్కిల్స్ ఉన్నప్పటికీ పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.