అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడు దశల్లో నిర్వహించిన పల్లె పోరు విజయవంతంగా ముగిసింది. దాదాపుగా 20 నెలల నుంచి బోసిపోయిన గ్రామాలకు కొత్త సర్పంచులు వచ్చారు. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ అదే జోష్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరిగాయి. మొత్తం 12,776 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. 6,782 స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 3,500 బీఆర్ఎస్ మద్దతుదారులు , 695 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 1,651 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.
Local Body Elections | జోష్‌లో కాంగ్రెస్
పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇదే ఊపులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కాంగ్రెస్‌కు మేలు జరుగుతుందని నాయకులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను అధికారులు రూపొందించారు. దీంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
Local Body Elections | తేలని రిజర్వేషన్ల పంచాయితీ
అధికారంలోకి వస్తే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఈ మేరకు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ గతంలో జీవో జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. అయితే జీవోను కోర్టు రద్దు చేయడంతో ఆ ఎన్నికల నోటిఫికేషన్‌ను కూడా ఈసీ వెనక్కి తీసుకుంది. అనంతరం ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు (BC Reservations) లేకుండానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినా.. అది ఎంతవరకు అమలు అయ్యిందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. కోర్టు విచారణ అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం తెలిపింది.
Local Body Elections | ప్రభావం చూపని రిజర్వేషన్ల అంశం
పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభావం చూపలేదు. గ్రామాల్లో ప్రజలు దాని గురించి చర్చించకుండానే.. ఎన్నికల్లో పాల్గొన్నారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు (ZPTC Elections) సైతం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలే అవకాశం లేదు. దీంతో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేశాక.. నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
Local Body Elections | ఆశావహుల నిరీక్షణ
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవికాలం గతేడాది జూన్‌తో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికల కోసం నాయకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు టికెట్ కేటాయించాలని నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్ కలిసి వస్తే ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ పదవులను దక్కించుకోవాలని పలువురు యత్నిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు.