అక్షరటుడే, వెబ్డెస్క్: MP Ricky Singkan | మేఘాలయ రాజకీయాల్లో విషాదం నెలకొంది. షిల్లాంగ్ పార్లమెంట్ సభ్యులు, వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ (VPP) నేత రికీ ఆండ్రూ జె సింగ్కాన్ హఠాన్మరణం చెందారు. షిల్లాంగ్లో గురువారం (ఫిబ్రవరి 19) సాయంత్రం ఫుట్బాల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
MP Ricky Singkan | మైదానంలో..
సింగ్మాన్ గురువారం సాయంత్రం షిల్లాంగ్ సమీపంలోని మావై మానియోంగ్లోని మిత్రులతో ఫుట్బాల్ ఆడటానికి వెళ్ళారు. ఫుట్బాల్ ఆడుతుండగా.. ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయారు. తోటి ప్లేయర్లు వెంటనే ఆయనను మావియోంగ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి తరలించారు. అక్కడి నుంచి జైవ్లోని డాక్టర్ హెచ్ గోర్డాన్ రాబర్ట్స్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రికీ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
సింగ్కాన్ మరణంపై పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి చెందారు. ఆయన మృతిపై సంతాపం తెలిపారు. రికీ 2024 లోక్సభ ఎన్నికల్లో షిల్లాంగ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ ఎంపీ విన్సెంట్ హెచ్ పాలాను 3.7 లక్షల ఓట్ల భారీ తేడాతో చిత్తుగా ఓడించారు.
MP Ricky Singkan | సీఎం సంతాపం..
సింగ్కాన్ మరణంపై మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా సంతాపం తెలిపారు. రికీ సింగ్కాన్ అంకితభావం గల నేత అని పేర్కొన్నారు. ప్రజల కోసం పరితపించే నాయకుడన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రికీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.