అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MP Lakshman | నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనగణన తర్వాత ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు.
దేశవ్యాప్తంగా త్వరలో జనగణన (Census) చేపట్టనున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జన గణన ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టదని చెప్పారు. ఆరు నెలల్లో పూర్తవుతుందన్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆయన తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు (Parliamentary Elections) జనగణన, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో దీనిని అమలు చేయనున్నారు.
MP Lakshman | ఒకేసారి ఎన్నికలు
తెలంగాణలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ఒకే సారి జరిగే అవకాశం ఉందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. గతంలో రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరిగేవి. 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఇప్పుడు వేర్వేరుగా జరుగుతున్నాయి. కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతోందనే వార్తల నేపథ్యంలో లక్ష్మణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జనగణన శాస్త్రీయ పద్ధతిలో చేపడుతామన్నారు. దీంతో నియోజకవర్గాల పునర్విభజన సులువు అవుతుందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌కు జనగణన కీలకం అని ఆయన వ్యాఖ్యానించారు.