అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Movie Ticket Rates | సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇక సినిమా టికెట్ల ధరలు పెంచమని ఆయన స్పష్టం చేశారు.
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ 2 సినిమా టికెట్ రేట్లను పెంచుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిని హైకోర్టు (High Court) కొట్టివేసింది. సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే న్యాయస్థానం తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో టికెట్ రేట్ల పెంపు అమలులోకి రానుంది. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. రాష్ట్రంలో టికెట్ రేట్లు పెంచబోమని స్పష్టం చేశారు.
Movie Ticket Rates | ఎవరు కలువొద్దు
పెద్ద సినిమాల విడుదల సందర్భంగా నిర్మాతలు, హీరోలు, దర్శకులు మంత్రులు, సీఎంను కలిసి టికెట్ రేట్లు పెంచమని కోరుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. నిర్మాతలు, దర్శకులెవరూ తమ దగ్గరకు రావొద్దని సూచించారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వమని, పేదల కోసమే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. హీరోలకు రూ.వందలకోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారని ప్రశ్నించారు. కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే తక్కువ ధరలుండాలని స్పష్టం చేశారు. టికెట్ ధరలు పెంచామని తమను ఎవరు కలువొద్దని ఆయన కోరారు.
Movie Ticket Rates | పొరపాటు జరిగింది
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు పెంచమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అయితే అనంతరం పలు మూవీలకు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి యూసఫ్‌గూడలో సినీ కార్మికుల సభలో మాట్లాడుతూ.. పెంచిన టికెట్ రేట్లలో 20 శాతం కార్మికుల సంక్షేమానికి కేటాయిస్తే టికెట్ ధరలు పెంచడానికి అనుమతిస్తామన్నారు. అయితే తాజాగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామని తెలిపారు. ఈసారి పొరపాటు జరిగిందన్నారు.