అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoists surrender | మావోయిస్టుల లొంగు‘బాట’ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ (Operation Kagar) ధాటికి తట్టుకోలేక నక్సల్స్ అడవులను వీడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లొంగిపోయాడు.
జిరామ్ వ్యాలీ హత్యాకాండ సూత్రధారి మాక్సిలే చైతు (Maxillary Chaitu) శుక్రవారం సరెండర్ అయ్యాడు. 2013 జిరామ్ దాడిలో 30 కాంగ్రెస్ నాయకులను హత్య చేశారు. తాజాగా చైతు లొంగిపోయాడు. ముగ్గురు మహిళలు సహా మొత్తం పది మంది సరెండర్ అయ్యారు. వీరిపై రూ.65 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు.
బస్తర్ (Bastar) జిల్లా ప్రధాన కార్యాలయం జగదల్పూర్లోని సీనియర్ పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారుల ముందు ‘పూనా మార్గెం’ చొరవ కింద వారు లొంగిపోయారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పట్టిలింగం తెలిపారు. మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చైతు అలియాస్ శ్యామ్ దాదా లొంగిపోవడంతో హింసాత్మక, ప్రజా వ్యతిరేక మావోయిస్టు భావజాలం ప్రభావం వేగంగా తగ్గుముఖం పడుతోందని పోలీసు అధికారి పేర్కొన్నారు.
Maoists surrender | వరంగల్ జిల్లా నుంచి..
చైతు అసలు పేరు గిరడ్డి పవన్నంద్ రెడ్డి. వరంగల్ (Warangal)కు చెందిన ఆయన 1985లో ఉద్యమ బాట పట్టాడు. 1991-92లో మహారాష్ట్రలోని గోండియా ప్రాంతం నుంచి దండకారణ్యానికి మారాడు. ప్రారంభంలో దళసభ్యుడిగా పనిచేసి, కమాండర్ అయ్యాడు. ఆ తర్వాత డివిజనల్ కమిటీ సభ్యుడయ్యాడు. ప్రస్తుతం మావోయిస్టుల దర్భా విభాగానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. అతడి తలపై రూ.25 లక్షల రివార్డు ఉందని ఐజీ తెలిపారు.
Maoists surrender | దాడుల్లో కీలక పాత్ర
బస్తర్ ప్రాంతంలో జరిగిన అనేక మావోయిస్టు దాడుల్లో చైతు కీలక పాత్ర పోషించాడని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ సభ్యుడు సరోజ్ అలియాస్ మల్కు సోధి, ప్రకాష్, కమలేష్ అలియాస్ జిత్రు యాదవ్, జన్ని అలియాస్ రేమతి సలాం, సంతోష్, రాంశీల అలియాస్ బుక్లి సలాం ఉన్నారు.
పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ (Dev Ji), కేంద్ర కమిటీ సభ్యుడు రాందార్, డీకేఎస్జెడ్సీ సభ్యుడు పాపారావు, దేవా ఇతరులతో సహా మిగిలిన మావోయిస్టు కార్యకర్తలు ఇప్పటికీ హింసను త్యజించి ప్రధాన స్రవంతిలో చేరే అవకాశం ఉంది అని తెలిపారు. గత 23 నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో 2,200 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని వెల్లడించారు.