అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | ఆదాయం కోసం ప్రభుత్వం భూముల అమ్మకానికి మరోసారి సిద్ధమైంది. హైదరాబాద్‌లోని పలు స్థలాలను అమ్మకానికి పెట్టింది. ప్రైమ్ లోకేషన్లలో (prime locations) ఉన్న భూములకు ఈ సారి రికార్డు ధర పలుకుతుందని భావిస్తోంది. హైదరాబాద్‌లోని మొత్తం 66 ఎకరాలను ఈసారి అమ్మకానికి పెట్టింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (Telangana Industrial Infrastructure Corporation) (టీజీఐఐసీ) ద్వారా వీటిని విక్రయించనుంది. రాయదుర్గంలోని స్థలాలకు నిర్ణయించిన ధర చర్చనీయాంశమైంది. గజానికి రూ.2 లక్షలకు పైగా టీజీఐఐసీ నిర్ణయించగా, అంతకు మించి ధర వస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి.
Hyderabad | ప్రైమ్ లొకేషన్లలో..
భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం కీలక ప్రాంతాల్లోని స్థలాలను విక్రయానికి పెట్టింది. రాయదుర్గంలో 4 ప్లాట్లు, ఉస్మాన్‌సాగర్‌లో 13 ప్లాట్లను వేలం వేయాలని నిర్ణయించింది. మొత్తం 17 ల్యాండ్ పార్సిల్స్‌లోని 66 ఎకరాలకు టెండర్లు ఆహ్వానించింది. ఆగస్టు 8న టెండర్ల దాఖలుకు గడువు ముగియనుంది. అదే రోజు టీజీఐఐసీ బోర్డు (TGIIC board) టెక్నికల్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆగస్టు 12న టెండర్లు ఖరారు చేయనున్నారు.
Hyderabad | గజానికి రూ.2 లక్షలపైనే..
ఈ వేలంలో రాయదుర్గంలో (Rayadurgam) వేలానికి ఉంచిన భూములకు భారీగా ధర లభిస్తుందన్న అంచనాలున్నాయి. టీజీఐఐసీ నిర్ణయించిన ధరలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. రాయదుర్గంలోని 7 ఎకరాలు కల 15A/2 ప్లాట్‌కు అత్యధికంగా రూ.71.60 కోట్లుగా మార్కెట్ ధరను పేర్కొన్న టీజీఐఐసీ.. కనీస ధరగా రూ.50.10 కోట్లుగా నిర్దారించింది. ఇక, అదే ప్రాంతంలోని ప్లాంట్ 19 ధర రూ.66.30 కోట్లు ఉండగా, అప్ సైట్ ప్రైస్‌ను రూ.44.30 కోట్లుగా పేర్కొంది. ఈ పార్సిల్‌లో 11 ఎకరాలను విక్రయించనున్నారు. రాయదుర్గంలోని 14B/1, 14A/1 ప్లాట్ల మార్కెట్ ధరను (market price) చదరపు గజానికి రూ.2.16 లక్షలుగా ప్రకటించారు. ఈ లెక్కన ఎకరానికి రూ.204.74 కోట్ల ధరగా నిర్ణయించారు. ఈ రెండు ప్లాట్ల అప్‌సెట్ ధరను చదరపు గజానికి రూ.1.51 లక్షలుగా పేర్కొన్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద 13 ప్లాట్లకు ప్లాట్‌ను బట్టి రూ.18.70 కోట్ల నుంచి రూ.25 కోట్లుగా నిర్ణయించారు.