అక్షరటుడే, వెబ్డెస్క్ : Outsourcing Employees | రాష్ట్రంలో భారీగా బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అసలు ఉద్యోగులు లేకుండానే.. జీతాల చెల్లింపులు జరుగుతున్నట్లు తేల్చింది. దీంతో ప్రభుత్వానికి పదేళ్లలో దాదాపుగా రూ.15 వేల కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో పలు శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో బోగస్ ఉద్యోగులపై మాజీ సీఎస్ శాంతి కుమారి (Former CS Shanthi Kumari) ఆధ్వర్యంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ఈ కమిటీ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ (BRS) హయాంలో చాలా మందిని ఔట్ సోర్సింగ్ కింద నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. అయితే అందులో రెండు లక్షల మంది పూర్తిస్థాయిలో ఉన్నట్లు కమిటీ తేల్చింది. మిగతా వారు అసలు లేకుండానే జీతాల చెల్లింపులు జరుగుతున్నట్లు గుర్తించింది.
Outsourcing Employees | నేతల జేబుల్లోకి..
పలువురు రాజకీయ నాయకులు కాంట్రాక్ట్ మ్యాన్ పవర్ కంపెనీలు (manpower companies) ఏర్పాటు చేసి ఈ డబ్బులు కాజేసినట్లు సమాచారం. ఉద్యోగులు లేకున్నా.. వారిని నియమించినట్లు సదరు కంపెనీలు డబ్బులు నొక్కేశారని కమిటీ గుర్తించింది. ఈ మేరకు సంబందిత ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా.. సెప్టెంబర్ 30 వరకు రెండు లక్షల మంది మాత్రమే ఇచ్చారు. మిగిలిన వారు ఈ నెల 25 లోగా ఆధార్ వివరాలివ్వాలని కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
అసలు ఉద్యోగులు లేకపోవడంతోనే మిగతా వారు వివరాలు ఇవ్వడం లేదని కమిటీ గుర్తించింది. గత పదేళ్లలో బోగస్ ఉద్యోగుల పేరిట దాదాపు రూ.15 వేల కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వని వారికి అక్టోబర్ నుంచి జీతాలు నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.