Homeఆంధప్రదేశ్Cyclone Montha | మొంథా ఎఫెక్ట్​.. రైల్వేస్టేషన్​ను ముంచెత్తిన వరద

Cyclone Montha | మొంథా ఎఫెక్ట్​.. రైల్వేస్టేషన్​ను ముంచెత్తిన వరద

భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌ను వరద ముంచెత్తింది. స్టేషన్​లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyclone Montha | మొంథా తుపాన్​ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్​తో (Andhra Pradesh) పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖమ్మం జిల్లా డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌లో పట్టాలపైకి వరద నీరు చేరింది. పలు రైళ్లు స్టేషన్​లోనే నిలిచిపోయాయి.

తీరం దాటిన మొంథా తుపాన్​ తెలంగాణ (Telangana) వైపు దూసుకు వస్తోంది. తుపాన్​ బలహీన పడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రైల్వేశాఖ (Railway Department) పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. పలు మార్గాల్లో రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. వర్షాలతో కొన్ని రైళ్లు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా (Khammam District) డోర్నకల్​లో మంగళవారం 114 మి.మీ. వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి 105 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో రైల్వే స్టేషన్​లోకి భారీగా వరద నీరు వచ్చింది. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ (Golconda Express) స్టేషన్​లో నిలిచిపోయింది.

Cyclone Montha | నిలిచిన పలు రైళ్లు

తుపాన్​ ప్రభావంతో 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరో 14 రైళ్లను రైల్వేశాఖ దారి మళ్లించింది. అయితే వర్షాలతో మధిర రైల్వే స్టేషన్‌లో షిరిడీ ఎక్స్‌ప్రెస్‌, పందిళ్లపల్లి రైల్వే స్టేషన్‌లో విజయవాడ – భద్రాచలం ప్యాసింజర్ రైలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగులో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ ఆగిపోయింది. అలాగే ఏపీలోని పలు స్టేషన్లలో భారీ సంఖ్యలో గూడ్స్‌ రైళ్లు నిలిచిపోయాయి. వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ అధికారులు సిబ్బందిని ఆదేశించారు.