అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cyclone Montha | బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ‘మొంథా’ (Montha) తుపానుగా ప్రభావం ప్రారంభమైంది. తుపాను వేగంగా బలపడుతూ నేడు తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను వల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతున్నాయి. తుపాను తీరానికి సమీపించే కొద్దీ ప్రభావం మరింత తీవ్రంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఈ తుపాను సాయంత్రం లేదా రాత్రికి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ (Kakinada) సమీపంలో, మచిలీపట్నం – కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు చేరవచ్చని హెచ్చరించారు.
Cyclone Montha | తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్
తుపాను ప్రభావంతో రాబోయే రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ముఖ్యంగా పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం (Khammam), నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ తదితర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు నష్టం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షపాతం, రోడ్ల పరిస్థితి, వ్యవసాయ నష్టాలపై సమీక్ష చేపట్టారు.
Cyclone Montha | రైల్వేశాఖ కీలక నిర్ణయం
తుపాను ప్రభావిత ప్రాంతాలపై దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 92 ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో హైదరాబాద్ – విశాఖపట్నం మార్గంలో నడిచే జన్మభూమి, ఫలక్‌నుమా, గోదావరి Godavari, గరీబ్ రథ్, విశాఖ ఎక్స్‌ప్రెస్ వంటి ముఖ్య రైళ్లు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ విజయవాడలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఇక తుపాను సమయంలో తీరప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని అధికారులు సూచించారు. నీటి ముంపు ప్రాంతాల్లో ప్రయాణం చేయకూడదని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని పేర్కొంటున్నారు. ‘మొంథా’ తుపాను రాత్రి తీరాన్ని తాకే అవకాశం ఉండడంతో, ఏపీ, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
