అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Easy Money | ఓ ప్రముఖ జ్యువెల్లరి సంస్థ యజమాని డబ్బులు ఊరికే రావని చెప్పే యాడ్ తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) ఎంతో ఫేమస్ అయింది. అయితే ఆ విషయాన్ని చాలా మంది ప్రజలు గ్రహించడం లేదు. అత్యాశకు పోయి మోసపోతున్నారు.
డబ్బులు ఊరికే రావు. కష్టపడి సంపాదించాలి. ఒక్క రోజులో లక్షలు సంపాదించలేము. ఒక్కో రూపాయి కూడబెడితే ధనవంతులం అవుతాం. అయితే కొందరు తెల్లారేసరికి కోటీశ్వరులు కావాలని కలలు కంటున్నారు. ఏ పని చేయడకుండా సులువుగా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నారు. ఈజీ మనీ కోసం ఆలోచించి అప్పుల పాలు అవుతున్నారు. ఇటీవల సైబర్ నేరాలు (cyber crimes) భారీగా పెరిగాయి. వీటిలో చాలా వరకు పెట్టుబడులకు సంబంధించిన మోసాలు ఉంటున్నాయి.
Easy Money | తక్కువ కాలంలో..
తక్కువ కాలంలో భారీగా లాభాలు వస్తాయని చెప్పి సైబర్ నేరగాళ్లు ప్రజలు బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి మోసాలకు గురి అవుతున్న వారిలో విద్యావంతులు, ఉద్యోగులు ఉండటం గమనార్హం. పేక్ యాప్‌లలో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు. టెలిగ్రామ్, ఇన్స్ట్రాగ్రామ్లలో వచ్చే ప్రకటనలు చూసి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అంటే ఆలోచించాలని అధికారులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ (Stock Markets) పేరిట ఇన్వెస్ట్మెంట్ అని ఫోన్లు వస్తే.. వారు చెప్పిన కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. సెబీ లైసెన్స్ ఉన్న బ్రోకరేజీ కంపెనీల ద్వారానే ఇన్వెస్ట్ చేయాలి. అలా కాకుండా అత్యాశకు పోతే ఉన్న డబ్బులు పోవడం ఖాయం.
Easy Money | ఆన్లైన్ గేమ్స్..
నేటి యువతరంలో కొందరు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. వీరు ఏ పనిచేయకుండా డబ్బులు రావాలి అనుకుంటున్నారు. దీని కోసం ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, జూదం ఆడుతున్నారు. వీటి కోసం అప్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో నష్టపోయి పలువురు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. మరికొందరు యువత జల్సాలకు అలవాటు పడి నేరాల బాట పడుతున్నారు. అనంతరం పోలీసులకు చిక్కి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
Easy Money | పూజల పేరిట..
పలువురు నకిలీ బాబాలు పూజల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు. వ్యాపారంలో లాభాలు వస్తాయని, ఇంట్లో లంకెబిందెలు దొరుకుతాయని చెప్పి బురడీ కొట్టిస్తున్నారు. ఇటీవల హన్మకొండ జిల్లాలో దొంగ బాబలు బ్యాగులో పెట్టిన డబ్బులకు పూజలు చేస్తే మూడింతలు అవుతాయని నమ్మించి రూ.55.55 లక్షలు కాజేశారు. ధర్మసాగర్ పోలీస్ట్ స్టేషన్ పరిధిలోని ఉనికిచెర్ల శివారులో ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది. తాము పూజలు చేసి డబ్బులను ఎక్కువ చేస్తామని నమ్మించారు. రూ.55,55,555 సిద్ధం చేసుకుంటే, వాటిని మూడింతలు చేస్తామని చెప్పారు. దీంతో బాధితుడు ప్లాట్ అమ్మడంతో పాటు, లోన్ తీసుకొని మరి డబ్బులు తీసుకొచ్చాడు. అనంతరం దొంగబాబాలు పూజలు చేస్తున్నట్లు నమ్మించి డబ్బులు ఉన్న బ్యాగ్‌తో పారిపోయారు. ఇలా ఎంతో మంది నిత్యం మోసపోతున్నారు.
ప్రజలు మోసపోవడానికి ప్రధాన కారణం అత్యాశ. సులువుగా డబ్బులు వస్తాయని చెప్పగానే.. ఆలోచించకుండా వారు చెప్పినట్లు చేస్తున్నారు. అనంతరం మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.