అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asia Cup | ఆసియాకప్ 2025లో భారత్ విజేతగా నిలిచి ఇప్పటికే మూడు వారాలు గడిచినా, ఇంకా టీమిండియా (Team India) చేతికి ట్రోఫీ, ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ అందలేదు.
ఈ ఆలస్యం వెనుక ఉన్న కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, పాకిస్థాన్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ (Pakistani Minister Mohsin Naqvi) అని తెలిసింది. ఫైనల్ మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించారనే ఆవేదనతో నఖ్వీ ట్రోఫీ, మెడల్స్‌ను హోటల్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. అప్పటి నుంచి ఈ అంశంపై బీసీసీఐ, మోహ్సిన్ నఖ్వీ మధ్య వివాదం చెలరేగింది.
Asia Cup | తగ్గేదే లే..
ఈ పరిస్థితిలో బీసీసీఐ (BCCI) తీవ్రంగా స్పందించింది. ఆసియాకప్ ఫైనల్ ముగిసిన రెండ్రోజుల తర్వాత జరిగిన ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) బోర్డు అధికార ప్రతినిధులు గట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా బీసీసీఐ అధికారికంగా ఏసీసీకి ఇ-మెయిల్ పంపి, ట్రోఫీని తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council) దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించింది. అయితే, మోహ్సిన్ నఖ్వీ మాత్రం తన నిర్ణయంపై నిలబడ్డాడు. “ఆసియాకప్ 2025 ట్రోఫీ భారత్‌కే చెందుతుంది. కానీ నేను ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నంతవరకు, నా చేతుల మీదుగానే టీమిండియాకు అందుతుంది అని అన్నాడు.
ప్రజెంటేషన్ వేడుక ఏర్పాటు చేయండి, కానీ ట్రోఫీని సరిహద్దులు దాటి పంపాలని మాత్రం ఆశించవద్దు. భారత్ తరపున ఒక ఆటగాడు వచ్చి నా చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవాలి అని నఖ్వీ బీసీసీఐకి పంపిన ఈ మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉందని తెలుస్తోంది. తన అనుమతి లేకుండా దాన్ని ఎక్కడికీ తరలించరాదని నఖ్వీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు బీసీసీఐ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో, ఈ ట్రోఫీ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.