అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Director Mohan Srivatsa | ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో (Film Industry) ప్రేక్షకుల అభిరుచి అర్థం చేసుకోవడం సినిమా మేకర్స్‌కు ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది. పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్నా, కథ బలంగా ఉన్నా.. సినిమా హిట్ అవుతుందనే గ్యారంటీ లేదు. అలాంటి ఓ పరిస్థితి ఇటీవలే విడుదలైన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రానికి ఎదురైంది.
ఈ సినిమా దర్శకుడు మోహన్ శ్రీవత్స (Director Mohan Srivatsa) తాను తెరకెక్కించిన సినిమాకు ప్రేక్షకుల నుండి స్పందన లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టు 29న విడుదలైన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాలో (Tribanadhari Barbarik Movie) సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ సింహ, సత్యం రాజేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మూవీకి మంచి కథా బలం ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
Director Mohan Srivatsa | దర్శకుడు ఎమోషనల్..
ఈ విషయాన్ని తట్టుకోలేక, దర్శకుడు మోహన్ శ్రీవత్స తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడే థియేటర్‌కి వెళ్లాను.. కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. వాళ్లని అడిగితే ‘సినిమా బాగుంది సార్’ అంటున్నారు. కానీ మంచి సినిమా అయితే మిగతా వాళ్లు ఎందుకు చూడటం లేదు ? అని ఆవేదన వ్యక్తం చేశారు. మూవీ విడుదల ముందు.. “సినిమా నచ్చకపోతే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా అని చెప్పిన మోహన్, ఇప్పుడు అదే పని చేశారు. నా ఛాలెంజ్ ఫెయిలయ్యింది.. అందుకే నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా.. అంటూ కొట్టుకున్నాడు. మూవీ నిర్మాణం కోసం రెండు సంవత్సరాలకు పైగా పిచ్చి కుక్కలా కష్టపడ్డాను. నా భార్య సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లి మధ్యలోనే బయటకు వచ్చేసింది.
ఎక్కడ నేను ఆత్మహత్య చేసుకుంటానో అని భయపడింది. మలయాళ సినిమాలు అయితే ఆదరిస్తారు. కానీ మన సినిమాలకే నో చెప్పేస్తున్నారు అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే మోహన్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొందరు ఆయనపై సానుభూతి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం “ప్రమోషన్ చాలా వీక్‌గా ఉంది”, “కంటెంట్ బాగుంటే రన్ అవుతుంది” అనే అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. మోహన్ శ్రీవత్స చివరలో పేర్కొన్న ఓ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తెలుగు ప్రేక్షకులు మలయాళం, తమిళం సినిమాలు చూస్తున్నారు. కానీ మన సినిమాలు నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేను మలయాళ ఇండస్ట్రీకి (Malayalam Industry) వెళ్లిపోతా. అక్కడ మంచి సినిమా తీసి తెలుగోడు సినిమాగా చూపిస్తా అని అన్నారు.