అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mohammad Siraj | టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్‌కి చెందిన మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలి కాలంలో టెస్టు క్రికెట్లో అతడి ప్రదర్శనను చూసి క్రికెట్ విశ్లేషకులంతా మెచ్చుకుంటున్నారు.
ఇంగ్లాండ్‌తో జరిగిన అండర్సన్-సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన సిరాజ్, ప్రస్తుతం వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో వరుసగా అన్ని మ్యాచులూ ఆడి, మొత్తం 23 వికెట్లు తీసిన సిరాజ్, టీమిండియా(Team India)కు కీలక విజయాలను అందించడంలో భాగస్వామిగా నిలిచాడు. ఈ సిరీస్ 2-2తో సమం కావడంలో అతని పాత్ర అపారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Mohammad Siraj | వెస్టిండీస్‌తో తొలి టెస్టులో 7 వికెట్లు
ప్రస్తుతం వెస్టిండీస్(West Indies)తో టెస్ట్ సిరీస్ జరుగుతున్న వేళ, సిరాజ్ తొలి మ్యాచ్‌లోనే 7 వికెట్లు తీసి మరోసారి తన ఫామ్‌ను నిరూపించాడు. రెండో టెస్టు అక్టోబర్ 10న ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సిరాజ్(Mohammad Siraj), తన కెరీర్‌ను ప్రభావితం చేసిన వ్యక్తిగా మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్పుకొచ్చాడు. టీమ్ఇండియాలోకి వచ్చినప్పుడు ధోనీ భాయ్ ఇచ్చిన సలహా జీవితాంతం గుర్తుండిపోతుంది. ‘ఇతరుల మాటలు పట్టించుకోకూడదు. బాగా ఆడితే ప్రపంచం మనవైపే ఉంటుంది. కానీ ఒకసారి ఫెయిలైతే తిడతారు.’ అని మహీ అన్నాడు. ఇది నిజంగా అక్షర సత్యం. తనపై వచ్చిన ట్రోలింగ్ గురించి కూడా సిరాజ్ తీవ్రంగా స్పందించాడు.
బాగా ఆడినప్పుడు ‘సిరాజ్ లాంటి బౌలర్ లేడు’ అని పొగిడారు.. కానీ ఫెయిలైతే ‘ఇలాంటి చెత్త బౌలర్‌ను చూడలేదు’ అంటూ ట్రోలింగ్ చేస్తారు. మీ నాన్నతో కలిసి ఆటో నడుపుకో అనే కామెంట్లు కూడా వచ్చాయి. కానీ ఆటలో ఇవన్నీ సహజం. ఒకరోజు హీరో అయితే, మరొక రోజు జీరో కావొచ్చు. నాకు మాత్రం జట్టు సహచరులు, కుటుంబ సభ్యుల అభిప్రాయం ముఖ్యం అని అన్నారు సిరాజ్. ఇక సిరాజ్ తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటూ, తన తండ్రి హైదరాబాద్(Hyderabad)లో ఆటో నడిపేవారని తెలిపాడు. ఐదేళ్ల క్రితం ఆయన కన్నుమూశారు. కానీ ఆయన ఆశయాలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి అని తెలియజేశాడు.